పింక్ బాల్ పరేషాన్ చేసింది. టైగర్లమంటూ.. చెలరేగిపోయేందుకు వచ్చి… ఈడెన్‌లో చల్లబడిపోయారు..బంగ్లాదేశ్ క్రికెటర్లు. పింక్ బాల్ కు భారత ఫాస్ట్ బౌలర్ల స్వింగ్ తోడవడంతో… బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలిపోయింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వారు 30 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. 106 పరుగులకు ఆలౌటయ్యారు. ఇందులో 14 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలోనే వచ్చాయి. భారత బౌలర్లలో “లంబూ” ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు, ఉమేష్ యాదవ్ మూడు, షమీ రెండు వికెట్లతో పండగ చేసుకున్నారు. పింక్ బాల్ భారత బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టినప్పటికీ.. వారు నిలదొక్కుకున్నారు. తొలి రోజే.. ఆధిక్యంలోకి వెళ్లిపోయారు.
ఈ జోరు ఇలా సాగితే.. తొలి టెస్టులాగే.. మూడు రోజుల్లోనే.. పింక్ టెస్ట్ కూడా ముగిసే అవకాశం ఉంది. పింక్ బాల్ ఎలా స్పందిస్తుందో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అంచనా వేయలేకపోయారు. టీమిండియా ఆటగాళ్లు ముందుగానే కఠోర సాధన చేయడం కలిసి వచ్చింది. ఏడేళ్ల క్రితమే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లకు ఐసీసీ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు భారత్ ఒక్క డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదే మొదటిసారి. ఈడెన్ టెస్ట్ చరిత్రలో నిలిచిపోనుంది. అటు ఫలితంగానూ.. ఇటు పింక్ బాల్ తోనూ… క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ప్రత్యేకంగా లిఖించుకుంటుంది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు గంట మోగించి అధికారికంగా మ్యాచ్‌ను ప్రారంభించారు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పగ్గాలు చేపట్టడం.. టీమిండియా సైతం డే నైట్ టెస్ట్ ఆడతామని అంగీకరించడంతో అతి తక్కువ సమయంలో ఈ డే నైట్ టెస్ట్‌కు ఈడెన్ గార్డెన్స్ ను ముస్తాబు చేశారు. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.