మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో అత్యవసర పిటిషన్ ను దాఖలు చేశారు. ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదని, ఈసీ కూడా పిన్నెల్లి అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం సరైంది కాదని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.
పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడం పట్ల పిన్నెల్లిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను అరెస్ట్ చేయాలని స్పష్టం చేయడంతో పిన్నెల్లి కోసం పోలిసులు విస్తృతంగా గాలిస్తున్నారు. బుధవారం ఆయన ఆచూకీ లభ్యమైందని సంగారెడ్డిలో అరెస్ట్ కూడా చేశారని ప్రచారం జరిగింది. కానీ అరెస్టు చేయలేదని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఆయన విదేశాలకు వెళ్ళకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనే లొంగిపోతారని పోలీసులకు సమాచారం అందడంతో నరసరావుపేట కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. తాజాగా పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.