పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నానని సంబర పడే పరిస్థితి లేకుండా పోయింది. దానికి కారణం బెయిల్ షరతులు. తనపై వరుసగా నమోదవుతున్న హత్యాయత్నం కేసులే. పిన్నెల్లి బెయిల్ షరతులు అత్యంత కఠినంగా ఉన్నాయి. ఆయన మాచర్ల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నర్సరావుపేట పార్లమెంట్ కేంద్రంగానే ఉండాలని కోర్టు ఆదేశించింది. కౌంటింగ్ సెంటర్ మాచర్లలో ఉంటే కౌంటింగ్ రోజు మాత్రమే మాచర్లకు వెళ్లే అనుమతి ఇచ్చారు. అంతే కాదు..తదుపరి విచారణ జరిగే ఆరో తేదీ వరకు ఆయన నర్సరావుపేటలోనే ఉండాలి. తేడా వస్తే అరెస్టు చేసుకోవచ్చని షరతుల సారాంశం.
నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు పిన్నెల్లి భవిష్యత్ తేలిపోతుంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆయనపై పెట్టిన కేసులన్నీ తేలిపోతాయి. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగమే మళ్లీ అమల్లోకి వస్తుంది. అతి భక్త పోలీసులు తమ విశ్వరూపం చూపిస్తారు. చట్టాలు, రాజ్యాంగాలు ఏమీ పని చేయవు. కానీ వైసీపీ ఓడిపోతే మాత్రం… రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. మూడు సింహాలు గర్జిస్తాయి. కౌంటింగ్ ట్రెండ్స్ తెలిసిన మరుక్షణం అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయి.
హైకోర్టు ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆయనపై రెండు హ త్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి సీఐపై .. మరొకటి టీడీపీ ఏజెంట్ పై దాడుల కేసుల్లో. ఈ కేసుల్లో ఇప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చు. కానీ ఇంకా పోలీసులు వైసీపీ అధినేత అదుపాజ్ఞల్లోనే ఉన్నారు కాబట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడున్నారో మాత్రం క్లారిటీ రావడం లేదు. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు చేస్తారన్న భయంతో ఇంకా ఆజ్ఞాతంలో ఉన్నట్లుగా నమ్మిస్తున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు.