ఓటీటీల వల్ల చాలా సౌలభ్యాలు వచ్చాయి. కొత్తగా ఆలోచించే వాళ్లకు కొత్త దారులు దొరికాయి. చిన్న చిన్న కథలకు సైతం వేదికలు ఏర్పడ్డాయి. సినిమా `లెంగ్త్`, విడ్త్…. అనే సూత్రాలు ఎగిరిపోయాయి. ఎంత చిన్న కథైనా చెప్పొచ్చు. కావాలంటే.. కొన్ని కథలు కలిపి ఒకే వేదికపై విడుదల చేయొచ్చు. హిందీలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు తెలుగులోనూ ఓ ఆంథాలజీ వచ్చింది. అదే `పిట్టకథలు`. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన… తొలి తెలుగు ఆంథాలజీ ఇది. నలుగురు వర్థమాన దర్శకులు… తయారు చేసుకున్న `పిట్ట కథలు`కావడంతో వీటిని చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదరు చూశారు. ఇంతకీ ఈ కథల్లో ఏముంది? ఆ కథల్ని చెప్పిన విధానమెట్టిది?
* రాముల
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కథ ఇది. తరుణ్ తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చినవాడు. అందుకే.. ఈ కథకూ.. ఆ బ్యాక్ గ్రౌండ్ నే ఎంచుకున్నాడు. రామచంద్ర, రాముల..ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే.. రాముల అన్నముందు తన ప్రేమని ఒప్పుకోవడానికి రామచంద్రకి ధైర్యం సరిపోదు. దాంతో… రామచంద్రని చీ కొడుతుంది రాముల. రామచంద్ర కూడా `బ్రేకప్` చెప్పేసి వెళ్లిపోతాడు. ఆ ఫస్ట్రేషన్లో రాముల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. స్వరూప (మంచు లక్ష్మి) అనే రాజకీయ నాయకురాలు.. రాములని కాపాడుతుంది. అయితే.. రాముల ప్రేమని తన రాజకీయ ఎదుగుదలకు పావుగా వాడుకుంటుంది. అదెలా.. అన్నది కథ.
38 నిమిషాల నిడివి గల కథ ఇది. తరుణ్ భాస్కర్ తెలంగాణ పోరడు కాబట్టి.. ఆ భాషపై పట్టుంది కాబట్టి, ఆయా సన్నివేశాల్ని తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించాడు. రాజకీయ నాయకుల దృష్టి ఎప్పుడూ కుర్చీ మీద, వేసుకునే దండల మీద, ఇచ్చే గౌరవం మీద ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు సైతం వాళ్ల ఈగో ఎంత హర్టవుతుందో… స్వరూప పాత్ర ద్వారా చూపించారు. తరుణ్ మైన్యూట్ డిటైలింగ్ నచ్చుతుంది. స్వరూప రాజకీయానికి రాముల ఎలా బలైందో చెప్పే కథ ఇది. క్లైమాక్స్ విషాద భరితం. `పెళ్లి చూపులు`, `ఈ నగరానికి ఏమైంది` చిత్రాలతో తన మార్క్ చూపించుకున్నాడు తరుణ్ భాస్కర్. తను ఇలాంటి సాధారణమైన కథని ఎంచుకుంటాడని అస్సలు అనుకోం. కథకేం గానీ, దాన్ని రియాలిటీకి దగ్గరగా తెరకెక్కించాడు. క్లైమాక్స్ ఎమోషన్ తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బూతులు యదేచ్ఛగా వాడేశారు. బహుశా.. `నెట్ ఫ్లిక్స్` ప్రమాణాలు అవే అని భ్రమపడి ఉంటారు.
* మీరా
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన కథ ఇది. మీరా (అమలాపాల్), విశ్వ (జగపతిబాబు) భార్యా భర్తలు. విశ్వకి మీరాపై అనుమానం ఎక్కువ. తన సోషల్ బిహేవియర్ ని లైట్ గా తీసుకోలేడు. మీరా కూడా అంతే… విశ్వ అనుమానాలకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తుంటుంది. దాంతో.. మీరా పై అనుమానం పెంచుకుంటాడు. అది కోపంగా మారుతుంది. ఆఖరికి తన తమ్ముడితో.. మీరా పడుకుందేమో అన్నంత అనుమానంగా చూస్తుంటాడు. తన బిడ్డలు తనకే పుట్టారా? అనే సందేహాల మధ్య బతుకుతుంటారు. వాళ్ల ఈగో క్లాష్లు, అనుమానాలూ ఎంత వరకూ వెళ్లాయన్నదే మీరా కథ.
చాలా సున్నితమైన విషయాన్ని నందిని బాగానే డీల్ చేసినట్టు. కథ మొదలెట్టేటప్పుడు… మీరా ప్రవర్తనపై ప్రేక్షకుడికీ అనుమానం కలిగించేలా చేసింది దర్శకురాలు. అయితే అది కేవలం ప్రేక్షకుడ్ని డైవర్ట్ చేయడానికే అని చివర్లో అర్థం అవుతుంది. తనని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న భర్తకు.. ఓ భార్య చెప్పిన గుణపాఠం ఇది. అయితే… ఆ గుణ పాఠం ఇలానే ఎందుకు ఉండాలి? అనే అనుమానం వేస్తుంది. భర్త తనని, తన పిల్లల్నీ ఎంత ప్రేమిస్తున్నాడో మీరాకు తెలుసు. అలాంటప్పుడు తన భర్తని మార్చడానికో, శిక్షించడానికో, భర్త నుంచి తప్పించుకోవడానికో.. ఇలాంటి ప్లాన్ ఎందుకు వేసింది అనిపిస్తుంది. ఈ నాలుగు కథల్లో కాస్త సెన్సిటీవ్ గా డీల్ చేసిన కథ ఇదేనేమో..?
* ఎక్స్ లైఫ్
మహానటి లాంటి సినిమా అందించిన నాగ అశ్విన్… ఈ కథకు దర్శకుడు. ఈ పాయింటే చాలా కొత్తగా ఉంటుంది. మనుషుల్ని ఓ ఊహా జనితమైన ప్రపంచంలోకి నెట్టేసే టెక్నాలజీ అబ్బుర పరుస్తుంది. అయితే.. ఆ టెక్నాలజీ ఏమిటో, దాని గొడవేమిటో అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. నిజంగా ఇలాంటి కథతో ఓ సినిమా తీయొచ్చు. అయితే ఆ పాయింట్ ని కంగాళీ చేశాడేమో అనిపిస్తుంది. తెలుగు కథే అయినా.. అందులో చాలా వరకూ ఇంగ్లీష్ సంభాషణలే ఉంటాయి. క్లైమాక్స్ కూడా చాలా వరకూ అర్థం కాదు. శ్రుతి హాసన్ హాట్ లిప్ లాకులు మాత్రం.. యువత కోసం ప్రత్యేకం. దర్శకుడు నాగ అశ్విన్ మరీ ఎక్కువగా ఆలోచించాడా? తన ఆలోచనలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయా? లేదంటే.. ఓ అర్థం కాని కాన్సెప్టుని మన మీద రుద్దడానికి ప్రయత్నించాడా? అనే డౌటు వేస్తుంది. కానీ ఈ కథలో చూపించిన టెక్నాలజీ, ఆ ఆలోచన.. సూపర్ అంతే. అంతకు మించి ఏం లేదు.
* పింకీ
అంతరిక్షం లాంటి డీసెంట్ సినిమా అందించిన సంకల్ప్ రెడ్డి… ఈ కథకు దర్శకత్వం వహించాడు. ఇది కూడా సెన్సిటీవ్ మేటరే. రెండు జంటల కథ ఇది. విడాకుల తరవాత కూడా మొదటి భర్తపై ప్రేమ (అలా అనకూడదేమో) తగ్గక… తనకు దగ్గరవ్వాలనుకునే ఓ గృహిణి కథ. ఆ పాయింట్ ని జీర్ణం చేసుకోవడం తెలుగు ప్రేక్షకులకు కాస్త కష్టమే. రెండు జంటల కథని మధ్యలోనే వదిలేసి లవ్ ఈజ్ ఎటర్నల్ అంటూ భారీ క్యాప్షన్ వేసి, కథని అర్థాంతరంగా ముగించేశాడు. విడాకులు తీసుకున్నాక.. ఎవరికి వాళ్లు కొత్త తోడుని వెదుక్కున్నాక… ఓ జంట ఇంకా శారీరక సంబంధం కొనసాగించడం.. కొత్త పాయింట్ అని సంకల్ప్ రెడ్డి భావించి ఉంటాడు. కాకపోతే.. దాన్ని అర్థం అయ్యేలా, ఆ పాయింట్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయాడు.
ఈ నాలుగు కథల నిడివీ ఒకటే. ఇంచుమించుగా 38 నిమిషాలు. ఆ విషయంలో ఒకే గొడుకు కిందకు వచ్చిన ఈ నాలుగు కథల నేపథ్యాలు మాత్రం వేర్వేరు. నలుగురు వర్థమాన దర్శకులు నాలుగు కథలు చెబుతారు అనుకుంటే.. ఏదో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్టులు అనుకుంటారంతా. అలా ఆలోచించిన వాళ్లకు నిరాశ తప్పదు. ట్రైలర్లో హాట్ హాట్ దృశ్యాలు చూసి, ఇదేదో.. ఓవర్ ది బోర్డ్ కథలనో, బోల్డ్ కథలనో భావిస్తారు. అక్కడా.. నిరుత్సాహమే. నాలుగు కథల్లో రాముల కాస్త చూడ దగినది. మీరా ఓకే అనిపిస్తే… మిగిలిన రెండూ సగం సగం అర్థమయ్యే కాన్సెప్టులే.