ఒక వృత్తిలో ఉన్న వారు ఆ వృత్తి ధర్మం పాటించాలి. దానికి సంబంధించిన కనీస విధి విధానాలను గౌరవించాలి. కానీ సాక్షి మీడియాలోని జర్నలిస్టుల పరిస్థితి దీనికి భిన్నం. ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచించే పరిస్థితి వారికి లేదు. బాస్ చెప్పిందే వేదం. చేసిందే చట్టం. బాస్ రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లడానికి రాజకీయ నాయకుల కంటే రెండడుగులు ముందుకు వెయ్యక తప్పని పరిస్థితి. ఇది దిగజారుడుతనం అని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానించినా ఏమీ చేయలేని నిస్సహాయత.
బాస్ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితంపై బుదర చల్లే విషయంలోనూ సాక్షి జర్నలిస్టులు తమ అంతరాత్మకు బదులు నిస్సహాయతకే విలువనిచ్చినట్టు కనిపిస్తుంది. లోకేష్ పై బురద చల్లినా, మరో విషయంలో అడ్డగోలుగా వితండ వాదం చేసినా, అదంతా బాస్ కోసమే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆరోపణలు, ఫిర్యాదులపై అరెస్టుల విషయంలో సాక్షి జర్నలిస్టులకు రెండు మూడు నాల్కలు, రెండు మూలు రకాల కలాలు ఉన్నట్టు కనిపిస్తుంది.
2008 జూన్ లో, చట్టానికి తమకిష్టమైన భాష్యం చెప్పి ఓ పత్రిక సంపాదకుడిని అరెస్టు చేయించింది ఆనాటి వైఎస్ ప్రభుత్వం. మంద కృష్ణ కార్యకలాపాలపై ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనాలు వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద ఫిర్యాదు చేశారు. అంతే, పత్రిక సంపాదకుడిని, మరో ఇద్దరు విలేకర్లను పోలీసులు అరెస్టు చేశారు. దళిత వ్యక్తిని మాటలతో గానీ చేతలతో గానీ కించపరిచినా, అవమానకరంగా ప్రవర్తించినా చర్య తీసుకోవాలనేది ఆ చట్టం ఉద్దేశం. కానీ ఆ పత్రిక సంపాదకుడు అలాటి పని ఏదీ చేయలేదు. పత్రిక కథనాల్లోనూ ఆయన కార్యకలాపాలపై విమర్శలున్నాయే తప్ప, ఆయన కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు లేవు. అయినా అరెస్టు జరిగాయంటే అది కక్ష సాధింపే అని స్పష్టంగా అర్థమయ్యే విషయం. మంద కృష్ణపై రాసిన రాతలు ఆయన పరువుకు నష్టం కలిగిస్తే ఓ పౌరుడిగా ఫిర్యాదు చేసే హక్కు, న్యాయ పోరాటం చేసే హక్కు ఆయనకున్నాయి. అయితే ఆయన్ని కులం పేరుతో కించ పరచడం అనేది జరిగిన దాఖలాలు లేవు.
ఆనాడు ఆ అరెస్టులు సరైనవే అని వై ఎస్ జగన్ ప్రకటన చేశారు. చట్టం తన పని తాను చేసిందని కొటేషన్ కూడా చెప్పారు. సాక్షి పత్రికలోనూ ఆ అరెస్టును సమర్థిస్తూ ఖరీదైన జర్నలిస్టులు పుంఖాను పుంఖాలుగా వార్తలు, కథనాలు, వ్యాసాలు రాశారు. తమ పూర్వాశ్రమంలోని పెద్ద పత్రికలో నేర్చుకున్న జర్నలిజం మెళకువలు, భాషా పటిమను సాక్షిలో తనివి తీరా ప్రదర్శించారు. ప్రభుభక్తిని చాటుకున్నారు.
ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు గురించి మాట్లాడుకుందాం. ఆయన తిరుపతి ఎయిర్ పోర్టులో దాడికి పాల్పడిన ఆధారాలు ఏవీ అని ప్రశ్నిస్తున్న సాక్షి జర్నలిస్టులు ఒక్కసారి ఆంధ్ర జ్యోతి ఎపిసోడ్ ను గుర్తు చేసుకుంటే మంచిది. సీసీటీవీ ఫుటేజిలో గొడవ జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ ఆంధ్ర జ్యోతి సంపాదకుడు ఏ దశలోనూ కులం పేరుతో కించ పరచలేదు. కాబట్టి ఆనాటి అరెస్టు కంటే ఈనాటి మిథున్ రెడ్డి అరెస్టుకే కాస్తో కూస్తో కనీస ఆధారాలు, అంటే ప్రైమా ఫేసీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ విషయాన్ని పాత్రికేయులు అడ్డంగా విస్మరించి వీర విధేయతను ఘనంగా చాటుకునే రాతలను పుంఖాను పుంఖాలుగా రాస్తూనే ఉన్నారు. వీరి బాస్ శిష్యులు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు కాబట్టి అధికారులందరూ వైఫై తరహాలో ఎప్పుడూ చుట్టూ కెమెరాలు పెట్టుకుని పనిచేయాలా? పాపం, సాక్షి జర్నలిస్టులకు ప్రొఫెషనల్స్ ఎథిక్స్ గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. నెల గడవగానే జీతం రావాలి. తప్పదు మరి !!