పిల్లి గుడ్డితైతే ఎలుక ఎక్కిరించిందన్నట్లుగా ఉంది … ఆంధ్రప్రదేశ్‌తో రైల్వేజోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి. విశాఖ రైల్వేజోన్ ప్రకటించి రెండేళ్లు దాటిపోయింది. ఎందుకు ఏర్పాటు చేయలేదని… రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్న అడిగితే… ఎప్పటి లోపు ఏర్పాటు చేయాలన్నదానిపై టైమ్ ఫ్రేమ్ ఏమీ పెట్టుకోలేదని ఘనత వహించిన మంత్రి పీయూష్ గోయల్ నిర్మోహమాటంగా ప్రకటించారు. బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకపోవడంతో ఈ ఏడాది కూడా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయరన్న ఆందోళన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతూండగా… పీయూష్ గోయల్ ఇలాంటి ప్రకటన చేశారు. రైల్వే జోన్ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని డీపీఆర్ ఇంకా పరిశీలనలోనే ఉందని పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడుతున్నారు.
రైల్వేజోన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల పరిశీలన జరిపిన తర్వాతనే.. జోన్ ప్రకటించారు. అంతకు మించిన డీపీఆర్ ఏముంటుందో పీయూష్ గోయల్‌నే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత బడ్జెట్ అవుతుందో కూడా లెక్కలేశారు. అప్పట్లోనే మూడు, నాలుగు నెలల్లో రైల్వే జోన్ పని పూర్తవుతుందన్న సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం.. ఇక్కడ వైసీపీ.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో రైల్వేజోన్ ఇవ్వాల్సిన అవసరం లేదని డిసైడయినట్లుగా ఉన్నారు. ఎవరూ ఒత్తిడి చేసే వారు కూడా లేకపోవడంతో కేంద్రం ఇప్పుడు ఎకసెక్కాలు ప్రారంభించింది. ఓ నిర్ణయం తీసుకన్నాక.. ఒక రోజు అటో ఇటో అమలు చేస్తారు కానీ.. అసలు ఎప్పట్లోపు అమలుచేస్తామో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజల డిమాండ్ మేరకు.. రైల్వేకు నష్టమో.. కష్టమో… జోన్ అయితే ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది. అడిగేవారు లేరని.. అందరూ భయంతో నోరు మూసుకున్నారని.. ఇక దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదుకుంటే అది ఖచ్చితంగా ప్రజల్ని అవమానించడమే అవుతుంది. ఇక్కడ ఓట్లు సీట్లు లేవన్న కారణంగా అలా ప్రవర్తిస్తే.. ఇతర చోట్ల కూడా ఆ ప్రభావం పడుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రానికే కేంద్రం కాదు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రమే పెద్ద. ఒకరిపై అతి శ్రద్ధ.. ఇంకొకరిపై సవతి శ్రద్ధ చూపితే.. ప్రజలపై వివక్ష చూపినట్లే అవుతుంది.