ఇదిగో రైల్వేజోన్ ప్రకటించేస్తున్నాం..! ఆ విషయం తెలిసే తెలుగుదేశం పార్టీ నేతలు క్రెడిట్ గేమ్ ఆడుతున్నారు…అని బీజేపీ నేతలు ఇప్పటికీ చెబుతూంటారు. రాజ్‌నాథ్ రాజ్యసభలో రైల్వేజోన్ ఇస్తమన్నారని… చెప్పి.. బీజేపీ నేతలు రైల్లో ఢిల్లీ పోయి..సన్మానం చేసి వచ్చారు. అలాంటివి చాలా జరిగాయి. మరి అన్ని జరిగిన తర్వాత రైల్వేజోన్ పరిస్థితి ఎక్కడిదాకా వచ్చింది..?. ఒడిషాకు చెందిన ఎంపీ.. పీయూష్‌గోయల్ తనకు చెప్పిన అంశాన్ని బట్టి… మొత్తం తేలిపోయిందని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ ఇచ్చే ప్రశ్నే లేదని… మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారని ఒడిషా ఎంపీ భాస్కర్ రావు.. బాంబు పేల్చారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తే అభ్యంతరం లేదని తాము గోయల్‌కు చెప్పామన్నారు. అయితే గోయల్ మాత్రం రైల్వేజోన్ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారట. ఏపీకి రైల్వేజోన్ ఎగ్గొట్టడానికి… ఒడిషాను దెయ్యలా కేంద్రం చూపిస్తోందని.. భాస్కర్ రావు మండి పడ్డారు.
విశాఖలో రైల్వే డివిజినల్ కమిటి సమావేశం జరిగింది. దీనికి ఏపీ ఎంపీలతో పాటు ఒడిషా ఎంపీలు కూడా హాజరయ్యారు. రైల్వేజోన్ డిమాండ్ చేస్తూ తెలుగుదేశం ఎంపీలు పూసపాటి గజపతిరాజు, కింజారపు రామ్మోహాన్ నాయుడు, అవంతి శ్రీనివాసరావు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. విశాఖకు రైల్వే జోన్ సాధించే వరకు వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని, కేంద్రం ముందు మరోసారి రైల్వేజోన్ ఆంశాన్ని పెడతామన్నారు. సమావేశంలో విశాఖ ఎంపీ హరిబాబు కూడా పాల్గొన్నారు. తన పదవి కాలం ముగిసేలోపు … ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వేజోన్ వస్తుందని.. ఆయన చెబుతూ ఉండేవారు. అసలు రైల్వేజోన్ పని అయిపోయిందని.. తీసుకొచ్చి చూపెడతామనేవారు. కానీ ఆయనకు కూడా క్లారిటీ వచ్చినట్లుగా ఉంది. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.
రైల్వేజోన్ వస్తుందని అందరూ ఎంపీల మాదిరిగా తాను కూడా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎంపీలు రాజకీయంగా వాడుకుంటున్నారని తేల్చేశారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం.. ఏపీ విషయంలో చాలా క్లారిటీగానే ఉన్నట్లుగా ఉంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే… బీజేపీకి బలం ఉన్నదగ్గరే.. శక్తియుక్తుల్ని కేంద్రీకరించాలి. బలం లేని చోట శక్తిని వృధా చేయకూడదనేది ఆయన భావన. దాన్నే ప్రభుత్వాల పరంగా అప్లయ్ చేస్తున్నట్లు ఉన్నారు. ఏపీలో ఏమీ రావు కాబట్టి… అసలు ఇక్కడ చేయాల్సినవి ఏవీ చేయకపోయినా పర్వాలేదనుకుంటున్నారు. కానీ ప్రజల సెంటిమెంట్‌ను మాత్రం దెబ్బతీస్తున్నారని గుర్తించలేకపోతున్నారు.