తెలంగాణలో టీడీపీని మళ్లీ బలోపేతం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల ప్రశాంత్ కిషోర్ తో పాటు, షోటైమ్ రాబిన్ శర్మ కూడా చంద్రబాబు, లోకేష్లకు ప్రజెంటేషన్ ఇచ్చారని చెబుతున్నారు. గత కొంత కాలంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసి.. టీడీపీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుని ఈ నివేదికను రెడీ చేసినట్లుగా చెబుతున్నా రు.
తెలంగాణ బీసీ వర్గాల్లో టీడీపీపై ఇంకా సానుభూతి ఉందని .. వారు టీడీపీ చేసిన మేలును మర్చిపోలేదని రిపోర్టు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ ప్రారంభించాలని వారు రోడ్ మ్యాప్ కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో కొంత మంది కీలక నేతల్ని చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నివేదికపై చంద్రబాబు, లోకేష్ స్పందన ఎలా ఉందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
రాష్ట్ర విభజన తర్వాత, అంతకు ముందు టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేసి ఆ పార్టీలో నేతలు ఉండటం మహాపాపం అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేశారు. ఈ కారణంగా ఎంతో మంది నేతలు పార్టీని వీడి వేరే పార్టీలో భవిష్యత్ వెదుక్కున్నారు. ఇప్పుడు సెంటిమెంట్ తగ్గిపోయింది. ఆ నేతలంతా టీడీపీపై తమ అభిమానాన్ని దాచుకోవడం లేదు. తెలంగాణ సమాజానికి టీడీపీ చేసిన మేలును ధైర్యంగానే చెబుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడుతున్న దశలో టీడీపీ బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో పీకే, రాబిన్ శర్మ రిపోర్టు హైలెట్ అవుతోంది. మరి చంద్రబాబు, లోకేష్ ఏ నిర్ణయం తీసుకుంటారో ?