కాంగ్రెస్ పార్టీలో చేరి గతంలో అహ్మద్ పటేల్ పోషించిన పాత్రలోకి దూరిపోవాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్‌కు ఆ పార్టీలోకి నో ఎంట్రీ బోర్డు కనిపిస్తోంది. పార్టీలో చేరొచ్చు కానీ.. మొత్తం చేతుల్లోకి తీసుకుని స్ట్రాటజీ మార్చేస్తానంటే ఖాళీగా ఎవరూ లేరని ఆ పార్టీ నేతలు తేల్చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ పీకే ఓవరాక్షన్ పట్ల అంత సంతృప్తిగా లేరు. ఆయన పార్టీకి అవసరం లేదని భావిస్తున్నారు. దీంతో ఎన్నో రాజకీయ ఆశలతో వచ్చిన ప్రశాంత్ కిషోర్‌కు అసహనం పెరిగిపోతోంది. అందుకే నేరుగా రాహుల్ గాంధీనే టార్గెట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల కిందట ప్రియాంకా గాంధీ నాయకత్వ లక్షణాలను చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నట్లుగా పీకే ప్రకటంచారు. ఇప్పుడు మళ్లీ రాహుల్‌పై మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఆ వ్యాఖ్యలతో పాటు భారతీయ జనతా పార్టీని విపరీతంగా పొగిడారు. బీజేపీ గెలిచినా ఓడినా వచ్చే మూడు, నాలుగు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ఆ పార్టీది కీలక పాత్రని… ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆగ్రహంతో ప్రజలు తిప్పికొడతారని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుగా పీకే చెబుతున్నారు.
మోడీని జనం తిరస్కరించినా.. బీజేపీ ఎక్కడికీ పోదన్నారు. మోడీ బలాన్ని అర్థం చేసుకని, అవగాహన చేసుకోనంతవరకు ఆయనను ఓడించడం అసాధ్యమన్నారు. ఇది రాహుల్ గాంధీ గ్రహించాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి స్ట్రాటజిస్ట్‌గా పని చేసిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీకి పని చేయబోనని ప్రకటించారు. అప్పుడే కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఆయన అనుకున్న రేంజ్ రాదని తెలిసిన తర్వాత కింది స్థాయి రాజకీయ నాయకుడి తరహాలో రాహుల్‌పై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు.