ప్రశాంత్ కిషోర్ సర్వేను అనధికారికంగా టీఆర్ఎస్ లీక్ చేసింది. కొంత మంది మీడియా ప్రతినిధులకు వివరాలు ఇచ్చింది. చాలా సెలక్టివ్‌గా నియోజకవర్గాల గురించి మాత్రమే లీక్ చేసింది. ఓవరాల్‌గా మొత్తం పరిస్థితి ఎలా ఉందో చెప్పింది. నిజంగా పీకే అలా ఇచ్చాడా లేకపోతే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ప్రజల్లో చర్చ జరగడానికి ఇలా చేశారా అన్నది తర్వాత తర్వాత తేలనుంది.
సొంతంగా మెజార్టీ సాధించనున్న టీఆర్ఎస్ !
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుదందని పీకే సర్వే తెలిపింది. ఇతరులపై ఆధారాపడాల్సిన అవసరం కూడా లేదని .. సొంత మెజార్టీ వస్తుందని కూడా పీకే నివేదిక తేల్చింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని… ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఇక బీజేపీ హడావుడి పెరిగినప్పటికీ.. చాలా దూరంగా మూడో స్థానంలో ఉంటుందని.. కొన్ని స్థానాల్లో పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది కానీ రాష్ట్రం మొత్తం పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పీకే తేల్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
టీఆర్ఎస్ సీనియర్ నేతలు.. ఎమ్మెల్యేలపై అసంతృప్తి !
ప్రజల్లో టీఆర్ఎస్లో సుదీర్ఘంగా ఉన్న సీనియర్ నేతలు.. ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉందని పీకే నివేదిక ఇచ్చారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో సానుకూలత లేదని.. ఖచ్చితంగా వారిని మార్చాల్సిందేనని చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా టీఆర్ఎస్ వర్గాలు కొన్ని మీడియాలకు లీక్ చేశాయి. ఆయా స్థానాల్లో సిట్టింగ్‌లకు సీట్లు ఉండవని ముందుగానే సంకేతాలు పంపేందుకు ఇలా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రభుత్వంపై కూడా అసంతృప్తి – తగ్గించే మార్గాలు !
ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి ఉందని ప్రశాంత్ కిషోర్ సర్వే తెలిపింది. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్న అసంతృప్తి ప్రతీ చోటా కనిపించిందని పీకే చెప్పారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అసంతృప్తిని తగ్గించుకోవాలన్నారు. అసలు కొత్త పించన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గంలో వారికి కొంత మందికి కొత్తగా మంజూరు చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు ముందు అడిగిన వారందరికీ రేషన్ కార్డులు, పించన్లు ఇవ్వబోతున్న కేటీఆర్ సభల్లో చెబుతున్నారు. అది పీకే ఎఫెక్టేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా ఇది పీకే సర్వేనా లేక.. పీకే సర్వేను తమకు అనుకూలంగా టీఆర్ఎస్ వర్గాలు లీక్ చేసుకున్నాయా అన్నది స్పష్టం కాలేదు. కాదు కూడా. కానీ ఇలాంటి సర్వేలు లీక్ చేసి.. చర్చ పెట్టడం టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్లో ఒకటని గతానుభవాలను బట్టి అంచనా వేయవచ్చు.