ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఇటీవలే వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటింది. 80 రోజులు, 36 నియోజక వర్గాలు, ఆరు జిల్లాల్లో ఇప్పటివరకూ జగన్ పాదయాత్ర చేశారు. జగన్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం బాగానే వస్తున్నారని వైకాపా వర్గాలు కొంత జోష్ గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది వారి లెక్కలు. అయితే, ఇదే పాదయాత్రలో వైకాపా రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా పనిచేస్తున్న సంగతి తెలిసిందే! పాదయాత్ర అనంతరం జగన్ పర్యటించిన ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఎలా మారిందీ, నాయకుల తీరు ఎలా ఉందీ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేసి పార్టీ అధినాయకత్వానికి పంపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు ఇటీవలే పీకే దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది..!
ప్రజా సంకల్ప యాత్రతో పార్టీకి జగన్ కొంత ఊపు తెస్తున్నా.. దాన్ని కొనసాగించడంలో ఇతర నేతలు విఫలమౌతున్నారనేది వైకాపాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నట్టు సమాచారం. అంతేకాదు, కొంతమంది నాయకులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కూడా సమస్యగా మారేట్టు ఉందనేది కూడా వినిపిస్తోంది! ఒక నియోజక వర్గంలోకి జగన్ పాదయాత్ర వస్తోందని అనగానే… అక్కడి పార్ట్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నవారు ఏర్పాట్లు బాగానే చేస్తున్నారట. అయితే, జగన్ వచ్చి వెళ్లాకనే అసలు సమస్య మొదలౌతోందనీ, పాదయాత్ర జరిగిన కొన్ని నియోజక వర్గాల్లో తామే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులమని నియోజక వర్గ ఇన్ ఛార్జ్ లు ప్రచారం చేసుకుంటున్నారట! పీకే టీమ్ కు ప్రధానంగా దృష్టికొచ్చిన అంశం ఇదేనని అంటున్నారు. అంతేకాదు… జగన్ పాదయాత్ర ముగిసిన వెంటనే ఆయా నియోజక వర్గాల్లో పార్టీ నేతలు విశ్రాంతి తీసుకుంటున్నారట! ‘జగన్ వచ్చి వెళ్లారు, చేయాల్సిన ఏర్పాట్లు చేసేశాం, అంతా బాగా చేశాం’ అని చేతులు దులుపేసుకుంటున్నారట.
జగన్ పాదయాత్ర తరువాత అసెంబ్లీ, పార్లమెంటు నియోజక వర్గాల సమన్వయకర్తలు వ్యక్తిగత పనుల్లో ముగినిపోతున్నారనీ, కేడర్ ను పెంచుకునే కార్యక్రమాలకు వారు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశంపై కొంతమంది వైకాపా కీలక నేతలు తాజాగా చర్చించినట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పీకే టీమ్ నివేదికలు జగన్ వరకూ చేరాయనీ, త్వరలోనే ఆయన క్లాస్ తీసుకుంటారనే అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.