తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీకి ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త అంటూ కొద్ది రోజులుగా ఆ పార్టీకి చెందిన కొంత మంది నేతలు మీడియాకు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. పార్టీకి హైప్ తీసుకు రావడానికి చాలా చెబుతున్నారు. అందులో ప్రశాంత్ కిషోర్ అనే ఆకర్షణ కూడా ఒకటి. ప్రశాంత్ కిషోర్ ఉంటే రాజకీయాల్లో గెలుపు ఖాయమనే ఓ నమ్మకం ఏర్పడింది. ఆయన ఇప్పుడు చాలా బిజీ స్ట్రాటజిస్ట్.. గెలుపు అవకాశాలు ఉన్న ప్రతి ఒక్కరితోనూ కలిసి పని చేస్తున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ,తమిళనాడులో స్టాలిన్ ఇటీవల.. పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకన్నారు. ఓ రకంగా ఆయన ప్రధానపార్టీలు.. అదీ ముఖ్యంగా గెలుపు అవకాశాలు ఉన్న వారితోనే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మరి షర్మిల పార్టీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటారా.. అన్నది కీలకం.
తెలంగాణ లో రాజకీయ పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిల 2023 ఎన్నికల టార్గెట్ గానే పని చేస్తున్నారు. అసలు పార్టీ పెట్టే ముందే.. ప్రశాంత్ కిషోర్‌ను షర్మిల టీం ఫీడ్ బ్యాక్ అడిగిందని.. ఆయన గొప్ప చాన్సులున్నాయని చెప్పిన తర్వాతనే రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఇప్పటికీ తెర వెనక ఉండి సూచనలు సలహాలు ఇస్తున్నారని…. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయి లో షర్మిల పార్టీ కి వ్యూహ కర్తగా రానున్నట్లు షర్మిల అనుచరులు చెబుతున్నారు.
జగన్‌తో విబేధించి షర్మిల పార్టీ పెట్టారో లేదో కానీ… జగన్‌తో చర్చించే పార్టీ పెట్టారనే అభిప్రాయం మాత్రం ఇప్పుడు ఎక్కువగా నినిపిస్తోంది. జగన్‌కు ప్రశాంత్ కిషోర్‌తో ఉన్న అనుబంధం మేరకు… ఒక వేళ .. జగన్ సిఫార్సు చేస్తే..పీకే మొహమాటానికయినా ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ఇప్పుడు పీకే చాలా అసైన్మెంట్స్లో ఉన్నారు. ఆయన ఒప్పుకోవడంపైనా సందేహాలు ఉన్నాయి. అదే సందర్భంలో పీకే గెలిచే పార్టీకి మాత్రమే సలహాదారుగా ఉంటారు.. ఏ మాత్రం తేడాగా ఉన్నా.. ఆయన వ్యూహకర్తగా ఒప్పుకోరనే విమర్శ కూడా ఉంది. అయితే ఇప్పటికైతే.. షర్మిలతోపాటు పీకేను కూడా.. ఆకర్షణ శక్తిగా చూపించి తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా… షర్మిల పార్టీ నేతలు ఉన్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.