పాన్ ఇండియా ప్రాజెక్టు సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది. 2023 సెప్టెంబరు 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇది.. `రెబల్` రిలీజ్ డేట్. దాంతో ప్రభాస్ అభిమానులు కంగారు పడుతున్నారు.కాకపోతే… ఈ డేట్ ఎంచుకోవడానికి పెద్ద కారణమే ఉంది. సెప్టెంబరు 28.. గురువారం వచ్చింది. సాధారణంగా బడా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. ఒక రోజు ముందుగా రిలీజ్ అవ్వడానికి కారణం… గురువారం నేషనల్ హాలిడే. ముస్లింల పండుగ మిలాదునబి గురువారం వచ్చింది. సో.. ఓ రోజు సెలవు కలిసొస్తుంది. శుక్ర, శని, ఆది వీకెండ్స్. అక్టోబరు 2 గాంధీ జయంతి. అంటే.. వరుసగా రాబోతున్న సెలవు రోజులు సలార్‌కి ప్లస్ కాబోతున్నాయన్నమాట. పాన్ ఇండియా సినిమాకి ఈ మాత్రం స్పేస్ కావాలి. సినిమా రిపోర్ట్ ఎలా ఉన్నా.. తొలి 5 రోజులూ… సలార్ బాక్సాఫీసు దగ్గర సునామీ సృష్టించేయొచ్చు. బాగుంటే మాత్రం ఇక సలార్‌ని ఎవరూ ఆపలేరు. అయితే.. అదే సెప్టెంబరు 28న హృతిక్ రోషన్ సినిమా `ఫైటర్` వస్తోంది. బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ – హృతిక్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రభాస్‌కున్న స్టామినా, తన క్రేజ్ ఇప్పుడు పూర్తిగా వేరు. ఒకప్పుడైతే హృతిక్ ని చూసి, ప్రభాస్ వెనక్కి తగ్గేవాడేమో..? ఇప్పుడు ప్రభాస్ ని చూసి హృతిక్ సినిమానే వెనుకడుగు వేసే అవకాశం ఉంది.