పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మొదటి విడతలో జరగాల్సిన ఎన్నికలు… అధికారులు సహకరించకపోవడం వల్ల నాలుగో విడతకు వాయిదా వేశారు. ఇప్పుడు నాలుగో విడత ఎన్నికలకు వచ్చేశాయి. దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీల్లో గెలిచి… తన ఓటమి ప్రజలు ఇచ్చింది కాదని.. ఈవీఎంలదేనని నిరూపించాలన్న పట్టుదలతో చింతమనేని ఉన్నారు. గత కొద్ది రోజులుగా అన్ని పంచాయతీలు చుట్టబెట్టేస్తున్నారు. భారీ హంగామా నేపధ్యంలో ప్రచారం చేస్తున్నారు.
చింతమనేని అలా తిరిగితే.. పంచాయతీల్లో వైసీపీ అనుకూల ఫలితాలు రావడం కష్టమని అనుకున్నారేమో కానీ ఆయనను అర్థరాత్రి అరెస్ట్ చేసేశారు. ఓ గ్రామంలో చింతమనేని ప్రచారం చేసి వెళ్లిన తర్వాత వైసీపీ వర్గీయులు టీడీపీ వాళ్లతో గొడవ పడ్డారు. దాన్నే పోలీసులు కాస్త మార్చుకుని చింతమనేని సర్పంచ్ అభ్యర్థిపై దాడి చేశారని.. సాక్షి మీడియాలో ప్రచారం చేసి పోలీసులు కేసు పెట్టి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయనను న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో .. నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తి పోలీసుల్ని ఆదేశించారు. దాంతో వదిలి పెట్టక తప్పలేదు.
అయితే చింతమనేని తనను అక్రమంగా అరెస్ట్ చేశారని… తాను స్టేషన్ నుంచి వెళ్లబోనని భీష్మించారు. పోలీసులు ఆయనను బలవంతంగా వ్యాన్లో ఎక్కించుకుని ఇంటి దగ్గర విడిచిపెట్టి ఊపిరి పీల్చుకున్నారు. చింతమేనని జైల్లో పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకున్న వైసీపీ ప్లాన్ వర్కవుట్ కాలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నో కేసులు పెట్టారు. రెండున్నర నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కూడా చింతమనేని ప్రమేయం లేకపోయినా.. ఎవరెవరిద్వారానో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా చింతమనేని వెనక్కితగ్గకుండా పంచాయతీ పోరు సాగిస్తున్నారు.