ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి అదానీ, గ్రీన్ కో లాంటి కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. దీనిపై సెటైర్లు పడినా లెక్క చేయలేదు. ఇప్పుడు వారితో ఏపీలో కూడా ఒప్పందాలు చేసుకోకపోతే ఏం బాగుంటుందని అనుకుంటున్నారేమో కానీ విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టాలని అనుకుంటున్నారు. గతంలోనే .. గౌతంరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలోచన చేసినా కార్యరూపంలోకి దాల్చలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మరోసారి పెట్టుబడుల సదస్సు గురించి ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
గత ప్రభుత్వం ప్రతీ ఏడాది పెట్టుబడుల సదస్సు నిర్వహించేది. విశాఖ వేదికగా జరిగే ఈ సదస్సుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ వచ్చే వారు. నచ్చిన వారు ఎంవోయూ చేసుకునేవారు. తర్వాత అధికారులు ఫాలో అప్ చేసుకుని పెట్టుబడులనుతీసుకు వచ్చేవారు. అలా ఎంవోయూ చేసుకున్న వారిలో సగం పరిశ్రమలు వచ్చినా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించేంది. అనూహ్యంగా వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత .. ఎంవోయూ చేసుకున్న వాళ్లని.. ప్రాథమికంగా అనుమతులు పూర్తయిన వాళ్లని వెళ్లగొట్టారు. కొత్త పరిశ్రమలు తీసుకు రాలేదు.
గత మూడేళ్లలో ఏపీలో పెట్టుబడులు పెడతామని వచ్చిన వారు ఒక్కరంటే ఒక్కరూ పెట్టుబడులు పెట్టలేదు. కొన్ని కంపెనీలు డమ్మీ కంపెనీలుగా తేలాయి. మరికొన్ని ఇంత వరకూ పనులు ప్రారంభించలేదు. అయితే ఏపీలో వ్యాపారం చేాయలనుకుంటున్న… కార్యకలాపాలు నిర్వహించాలనుకుంటున్న కంపెనీలు… సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం జోలికి వెళ్లడం లేదు. ఇప్పుడు పెట్టుబడుల సదస్సు నిర్వహించి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకు వస్తున్నట్లుగా ఎంవోయూలు చేసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి కలిగినట్లుగా ఉంది.