సుందర్ సి. దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన ‘అరణ్మయి’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. అలాగే తెలుగులో ‘చంద్రకళ’గా విడుదలై ఇక్కడ కూడా మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా తమిళ్లో ‘అరణ్మయి2’, తెలుగులో ‘కళావతి’ వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలి కాలంలో హార్రర్ నేపథ్యంలో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. తమిళ్, తెలుగు ప్రేక్షుల అభిరుచి ఈ విషయంలో ఒకలాగే వుంది. దాన్ని దృష్టిలో వుంచుకొని ఇలాంటి సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి సుందర్ సి. మాట్లాడుతూ అరణ్మయి చిత్రం రిలీజ్ అయ్యే వరకు తనకు సీక్వెల్ చేసే ఆలోచన లేదని, సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం, పార్ట్2 ఎప్పుడు చేస్తారని అందరూ అడగడం, అలాగే మా పిల్లలు కూడా సెకండ్ పార్ట్ చేస్తే బాగుంటుంది అనడంతో సీక్వెల్‌కి కథ ఆలోచించడం మొదలు పెట్టాను. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బాగా వచ్చింది. ప్రేక్షకులకు ఈ సినిమా మంచి థ్రిల్‌ని కలిగిస్తుంది. ఫస్ట్ పార్ట్ చేసినపుడు సీక్వెల్ చెయ్యాలని ఆలోచన లేకపోయినా, ఇప్పుడు సెకండ్ పార్ట్ చేసిన తర్వాత, వచ్చిన ఔట్పుట్ చూసిన తర్వాత పార్ట్ 3 కూడా చెయ్యాలనిపిస్తోంది అంటున్నాడు సుందర్ సి. అంటే త్వరలోనే ‘అరణ్మయి3’ కూడా స్టార్ట్ అవ్వబోతోందన్నమాట.