తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార టీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వందకు వంద శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను టీఆర్ఎస్ గెలుచుకోవల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నేతలకు టార్గెట్‌గా పెట్టారు. ఆ మేరకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా టీఆర్ఎస్ ఓడిపోతే మంత్రుల పదవులు ఊడిపోతాయని ఆయన హెచ్చరించారు. ఈమధ్య జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని నవ్వుకుంటూ చెప్పినా ఇది చాలా సీరియస్సేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల తరువాత కేసీఆర్ మంత్రుల, ఎమ్మెల్యేల పనితీరుపై కూలంకషమైన సమీక్ష చేయబోతున్నారు. మంత్రులు తమ శాఖల విషయంలో ఎలా పనిచేస్తున్నారు? మున్సిపల్ ఎన్నికల్లో ఎలా పనిచేశారు? పార్టీలో వారి తీరు ఎలా ఉంది? పార్టీకి ఏమైనా నష్టం కలిగించే పనులు చేస్తున్నారా? …ఈ అంశాలన్నింటి మీద ఆయన సమీక్ష చేస్తారు. ఈ సమీక్షలో తేలే ఫలితాలను బట్టి మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారని, ఇది భారీగానే ఉంటుందని సమాచారం. మున్సిపల్ ఎన్నికలు కాగానే ప్రక్షాళన ఉంటుందా? బడ్జెటు సమావేశాల తరువాత ఉంటుందా? తెలియదు.
కాని ‘కొత్త కేబినెట్’ తెర మీదికి వస్తుందని టీఆర్ఎస్ నేతలు కొందరు చెబుతున్నారు. ఉన్న మంత్రుల్లో కొందరిపై వేటు పడుతుంది. కొందరు కొత్తగా ప్రవేశిస్తారు. ఒక సమాచారం ప్రకారం ఐదుగురు మంత్రుల పనితీరు కేసీఆర్‌కు నచ్చడంలేదు. వారు ఆయన్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. వారి మీద వేటు పడొచ్చని అనుకుంటున్నారు. అసలు ఈ ఐదుగురు మంత్రులను గత ఏడాది సెప్టెంబరులోనే తొలిగించాలని అనుకున్నారట. కాని సామాజిక సమీకరణాలు, రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచన విరమించుకున్నారు. ముఖ్యమంత్రి కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే సమాచారం ఒకపక్క హల్చల్ చేస్తుండగా, ఆ పని ఇప్పుడే చేయకపోవచ్చని మరో సమాచార వినిపిస్తోంది.
కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు కొద్దికాలంగా జోరుగా వినబడుతున్న సంగతి తెలిసిందే కదా. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని మంత్రులు, నాయకులు అదేపనిగా అంటున్నారు. నిజంగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ఉన్న మంత్రివర్గాన్ని రద్దు చేయాల్సివుంటుంది. కాబట్టి ఇప్పుడే ప్రక్షాళన చేయకపోవచ్చని కొందరు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో సాగుతున్న మరో ఊహాగానం ఏమిటంటే…కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ బంధువు, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను, చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని అనుకుంటున్నారు. ఇక ఇద్దరు మంత్రుల మీద తండ్రీకొడుకులు అసంతృప్తిగా ఉన్నారు. వారు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. వారిపై వేటు పడుతుందని భావిస్తున్నారు.
ఏదిఏమైనా టీఆర్ఎస్లో ఏదో జరగబోతోందని నాయకులు అనుకుంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరి భవిష్యత్తు ఏమిటో అర్థం కావడంలేదు. తాజాగా తిరుమలలో మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం, మర్యాదలు లభించగా, మరో మంత్రి హరీష్‌రావుకు అవమానం ఎదురైందని, ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారని వచ్చిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అంటే కేటీఆర్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా భావించి ఘనస్వాగతం పలికి మర్యాదలు చేశారా?