ఓబుళాపురం ఖనిజం మళ్లీ మైనింగ్‌కు సిద్ధమవుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి కేసుల్లో ఆ గనులను సీబీఐ సీజ్ చేసింది. దాంతో అక్కడ ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదు. అయితే… ఆ గనులకు సమీపంలోనే… పట్టా భూమిలోని సర్వే నంబరు 370, 58/పిలో మైనింగ్‌కు సాయిబాలాజీ మినరల్స్ అనే కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రభుత్వం లీజులు ఇవ్వడం లేదు. గతంలో ఓ సారి ఆన్లైన్లో పర్మిషన్ తెచ్చుకోవడానికి కొంత మంది ప్రయత్నించినా అధికారులు గుర్తించి నిలిపివేశారు. అయితే.. కొత్త ప్రభుత్వం మాత్రం.. అనుమతులు మంజూరు చేసినట్లుగా చెబుతున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళా మైనింగ్ కంపెనీ .. ఆయనకు చెందిన ఇతర కంపెనీలు.. అనుమతులు పొందింది గోరంత అయితే.. తవ్వుకుంది కొండంత. ఈ విషయాన్ని సీబీఐ కూడా స్పష్టం చేసింది. ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దుల్ని సైతం కూల్చేసి.. చేసిన మైనింగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అధికార పెద్దల ప్రాపకం ఉండటంతో… మైనింగ్ విచ్చలవిడిగా సాగింది. ఆ తర్వాత సీబీఐ కేసులు రావడంతో మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు కదలిక వస్తోంది. సీబీఐ సీజ్ చేసిన గనుల్లో అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజం ఉంటుంది. సాయిబాలాజీ మినరల్స్ అనే సంస్థ లీజుకు తీసుకున్న పట్టా భూమిలో ఖనిజం అత్యంత నాసిరకమైనది. దాన్ని ఎవరూ కొనుగోలు చేయరు.
అయితే.. లీజుకు తీసుకున్నది ఒక ప్రాంతమైనా… సీబీఐ సీజ్ చేసిన భూముల్లో ఉన్న ఖనిజాన్ని.. తవ్వుకుని.. తాము లీజుకు ఇచ్చిన చోటనే తవ్వుకున్నామని పత్రాలు సృష్టించుకుని రవాణా చేస్తూంటారు గనుల యజమానులు. గతంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అవసరం లేకపోయినా.. నాణ్యమైన ఖనిజం లేకపోయినా… సీబీఐ సీజ్ చేసిన గనులకు దగ్గరగా.. ఇతరులకు మైనింగ్ కు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న చర్చ నడుస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వడానికి సిద్ధపడలేదు కానీ… ఇప్పుడు ఆ పని చేయడం ఏమిటన్న సందేహం వస్తోంది. సహజంగా… అనుమతులు.. ఓ కంపెనీ పేరుపై తీసుకుంటారు కానీ.. దాని వెనుక మైనింగ్‌లోని బడా వ్యక్తులు ఉంటూ ఉంటారు..! ఇప్పుడు కూడా అలాంటిదేదో జరుగుతుందనే రాజకీయ రగడ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.