అసెంబ్లీలో దూకుడుగా ఉండే టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడులపై సభకు రాకుండా వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోని ప్రివిలేజ్ కమిటీ నేడు సమావేశం కానుంది. వీరిద్దరిపై జగన్మోహన్ రెడ్డితో పాటు… చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులను చర్చిస్తారు. తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేస్తారు. అయితే అదే సమయంలో.. అసెంబ్లీలో అబద్దాలు చెప్పారంటూ.. సీఎం జగన్, వ్యవసాయ మంత్రి కన్నబాబులపై టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులును మాత్రం పరిశీలించే అవకాశం లేదని చెబుతున్నారు.
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో… నిమ్మల రామానాయుడు పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్రామా నాయుడు అంటూ సంబోధించడం ప్రారంభించారు. దీంతో నిమ్మల .. మీరు జైలు రెడ్డా..? అని ప్రశ్నించారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. సభ్యుడిపై స్వయంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఇక అచ్చెన్నాయుడుపై వివిధ రకాల కారణాలు చూపుతూ.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. వాటిపై చర్చించనున్నారు. వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే.. అదీ కూడా… అసెంబ్లీ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేసే ఉద్దేశంతోనే ప్రివిలేజ్ కమిటీ భేటీ పెట్టారన్న చర్చ జరుగుతోంది. త్వరలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.
తెలుగుదేశం పార్టీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా అసభ్యంగా మాట్లాడటంతో ఆమెను సమావేశాలకు రాకుండా వేటు వేశారు. ఇప్పుడు అదే తరహాలో టీడీపీ ఒకరిపై వేటు వేస్తే.. తాము ఇద్దరిపై వేటు వేయగలమని వైసీపీ చెప్పాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రివిలేజ్ కమిటీ.. వారి వివరణలు కూడాతీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వైసీపీ సభాసంప్రదాయాలను పెద్దగా పట్టించుకోవడంలేదు కాబట్టి…. వెంటనే నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమపై వేటు వేస్తే… టీడీపీకి ఉన్న ఇరవై మందిసభ్యుల్ని కూడా ఎదుర్కోలేని వైసీపీ పిరికితనమేనని ప్రచారం చేయాలని ప్రతిపక్ష పార్టీ నిర్ణయించుకుంది.