కుంగిపోతున్నాం మహానుభావా… మీ వడ్డింపులు ఆపండి.. పరిశ్రమ పీక నొక్క మాకండి.. అని సీఎం జగన్ రెడ్డిని బతిమాలుతూ పరిశ్రమలు పేపర్ ప్రకటనలు ఇచ్చే దుస్థితి ఏర్పడింది. ఏపీ ఫెర్రో అలాయ్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఓ పేపర్ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి పేరుతో ప్రచురించిన ఆ ప్రకటనలో… కరెంట్ చార్జీలు తగ్గించాలని వేడుకున్నారు. అది కూడా ఇటీవల పెంచిన వాటినే.
ఇటీవల ఏపీలో కరెంట్ చార్జీల భారం ఊహించనంతగా పెరిగింది. సామాన్యుడి ఇంటికే తట్టుకోలేని భారం వస్తోంది. ఇక అత్యధికంగా విద్యుత్ వాడుకునే ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల గురించి చెప్పాల్సిన పని లేదు. దీంతో ఆ సంస్థలు మూసివేత దిశగా వెళ్తున్నారు. ఏపీలో 39 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ప్రొడక్షన్ పూర్తిగా కరెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థల ఉత్పత్తి ఖర్చులో 70 శాతం వరకూ కరెంట్ ఖర్చులే ఉంటాయి. అయితే పెరుగుతున్న చార్జీలతో ఈ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో ఏపీలో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల వల్ల దేశానికి .. రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో వివరిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఏడాదికి వెయ్యి కోట్లకుపైగా జీఎస్టీ కడుతున్నామని.. మూడువేల కోట్ల వరకూ ఏటా విద్యుత్ బిల్లులు కడుతున్నామన్నారు. ఐదు వేల కోట్ల వరకూ విదేశీ మారకద్రవ్యం ఈ పరిశ్రమలు దేశానికి సంపాదించి పెడుతున్నాయన్నారు. ముఫ్పై వేల మంది ఉద్యోగులు ఉన్నారని.. గుర్తు చేశారు. అంతిమంగా వీరు చెప్పేదేమిటంటే.. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే.. పరిశ్రమలు మూతబడిపోతాయి. ఏపీ పరిశ్రమల పరంగా మరింత నష్టపోతుంది అని.
ఇప్పటికే ఈ సంస్థలు జూలై ఒకటో తేదీ నుంచి తమ ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు చెప్పుకున్నా ఇంకా వేధింపులకు పాల్పడుతున్నారు కానీ.. అసలు సమస్య పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.