అలనాటి మేటి మధుర గాయకుడు వి. రామకృష్ణ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో గల తన నివాసంలో ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అమర గాయకుడు స్వర్గీయ ఘంటసాల గొంతును మరపించే విధంగా ఆయన స్వరం ఉండటంతో ఆయన పాడిన పాటలకు విశేషాదరణ లభించింది. ఆయన మొదట్లో ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడేవారు.
ఆయన 1972లో విచిత్రబందం సినిమాలో ‘వయసే ఒక పూల తోట’ అనే పాటతో ఆయన సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అప్పటి నుండి మరిక వెనక్కి తిరిగి చూసుకొనే అవసరమే ఏర్పడలేదు. ఆయన సుమారు 5000 లకు పైగా గీతాలు పాడారు. తాతా మనవడు, అందాల రాముడు, భక్త తుకారం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, అందరూ దొంగలే, చక్రవాకం, బలిపీఠం, గుణవంతుడు, యశోద కృష్ణ, ముత్యాలముగ్గు, భక్త కన్నప్ప, దానవీరశూర కర్ణ, కరుణామయుడు, వయసు పిలిచింది, యువతరం కదిలింది, శ్రీ షిరిడి సాయి మహత్యం, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలలో ఆయన పాడిన పాటలు ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు, ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తిని అందించినవే. ఆ సినిమాల పేర్లు వినగానే వాటిలో ఆయన పాడిన పాటలు నేటికీ ప్రజలకు టుక్కున గుర్తుకు వస్తాయంటే అతిశయోక్తి కాదు. అంత సుమధురంగా ఉండేవి ఆయన పాడిన పాటలు. 1970-80లలో ఆయన పాడిన ప్రతీపాట కూడా ఆణిముత్యం వంటిదే.
అలనాటి మేటి నటులు కృష్ణం రాజు, స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్ఆర్, శోభన్ బాబు తదితరులకు ఆయన అనేక సినిమాలలో డబ్బింగ్ కూడా చెప్పారు. ఆయన సినిమాల కోసం పాడిన పాటలకి ఎంతటి ప్రజాధారణ ఉండేదో ఆయన పాడిన భక్తి గీతాల ఆల్బమ్స్ కి కూడా అంతే విశేషాదరణ ఉండేది. ఆయన సినిమాలలో పాడటం తగ్గించుకొన్న తరువాత రాష్ట్రంలో, దేశవిదేశాలలో సినీ సంగీత విభావరి నిర్వహించేవారు.
గత ఐదారేళ్ళుగా ఆయన అనేక తెలుగు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. వి. రామకృష్ణగా తెలుగు ప్రజలకు సుపరిచితుడయిన విస్సంరాజు రామకృష్ణ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఐదు రోజులకి అంటే ఆగస్టు 20,1947లో జన్మించారు. ఆయన 1977లో దూరదర్శన్ లో పాటలుపాడే జ్యోతీకృష్ణ అనే గాయనీమణిని వివాహం చేసుకొన్నారు. వారికి సాయి కిరణ్ అనే ఒక కుమారుడు, లేఖ అనే ఒక కుమార్తె ఉన్నారు. వారిలో సాయి కిరణ్ 2001 సం.లో “నువ్వే కావాలి” సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. దశాబ్దాలుగా తెలుగు ప్రజలని అలరారించిన సుమధుర స్వరం శాస్వితంగా మూగపోవడంతో ఆయన అభిమానులు, సంగీత ప్రియులు చాలా బాధపడుతున్నారు.