కశ్మీర్లో ఆర్టికల్ 370 తర్వాత .. కేంద్ర ప్రభుత్వం.. అత్యంత కీలకమైన అడుగు వేయబోతోందని.. ప్రచారం జరిగింది. మోడీ, అమిత్ షా ఈ విషయంలో.. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఆ కీలకమైన అడుగుల్లో మొదటగా వినిపించినది.. అయోధ్యలో రామాలయం నిర్మించడం.. రెండో ప్రాధాన్యతగా వినిపించింది… ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం. కానీ.. ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ… తమ తదుపరి లక్ష్యం.. ఈ రెండు కాదని క్లారిటీ ఇచ్చారు. తమ తదుపరి లక్ష్యం… ” ఒకే దేశం – ఒకే ఎన్నిక ” అని స్పష్టంగా ప్రకటించారు.
ఎర్రకోట మీద నుంచి మోడీ ఇచ్చిన ప్రసంగంలో… ఒకే దేశం.. ఒకే విధానం అన్న అభిప్రాయన్ని కల్పించేందుకు ప్రయత్నించారు. రాబోయే కాలంలో సరికొత్త భారతావని నిర్మిద్ధామని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ ఆకాంక్షను నెరవేర్చాం. కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చాం. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయని, ఆర్టికల్ 370, 35A రద్దుతో కాశ్మీర్ ప్రజలకు బహుమతి ఇచ్చామని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అమలులోకి వచ్చిందని చెబుతూ.. అలాగే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడానికి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక దేశంలో ఒకే విధానం అమలులో ఉండాలనే ఉద్దేశంతోనే తాము దేశం మొత్తం ఒకే పన్ను విధానం .. జీఎస్టీని తీసుకువచ్చామని ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తుచేశారు. వీటన్నింటిని అనంతరం ఇక తర్వాతి వంతు ఒకే దేశం.. ఒకే ఎన్నికదే అని మోడీ స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఎర్రకోట మీద నుంచి చెప్పారంటే. అది జరిగి తీరాల్సిందేనని.. జరిగి తీరుతుందని.. ప్రస్తుతం.. జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా చూసినా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తిరుగులేని మద్దతు ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలంతా మద్దతు పలికే పరిస్థితి ఉంది. అందుకే.. మోడీ, అమిత్ షా కూడా.. ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే విధానానంపై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఎర్రకోటపై నుంచి అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఈ సారి దేశంలో జరగబోయేది.. వన్ నేషన్ – వన్ పోల్ అని .. సులువుగా అర్థం చేసుకోవచ్చు..!