హైదరాబాద్: ప్రజాస్వామ్య భారతదేశాన్ని మతతత్వ పాకిస్తాన్‌గా మార్చాలని సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని ప్రముఖ సైంటిస్ట్, సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డ్‌ను ఆయన ఇటీవల వెనక్కు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని కీలక సంస్థలన్నింటినీ ఆరెస్సెస్ ప్రతినిధులతో నింపుతున్నారని భార్గవ ఆరోపించారు. కొన్ని సంస్థలకు వారినే అధిపతులను చేస్తున్నారని అన్నారు. పదవుల నిర్వహణ, బాధ్యతల అప్పగింతకు సంఘ్ పరివార్‌తో ఉన్న అనుబంధమే అర్హతగా మారిపోయిందని ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ – ఆరెస్సెస్‌కు రాజకీయ రూపమేనని అన్నారు. ఆరెస్సెస్ హిందూత్వాన్ని ప్రోత్సహిస్తోందని, మత రాజకీయాలకు ఊతమిస్తోందని, కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ఇదే ఎజెండాతో వెళుతోందని చెప్పారు. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోందికూడా మోడి కాదని, ఆరెస్సెస్సేనని అన్నారు. సమాజాన్నికూడా సంఘ్ పరివార్ శాసిస్తోందని భార్గవ ఆరోపించారు. మనం ఏం తినాలో, ఏ దుస్తులు ధరించాలోకూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారని అన్నారు.
మరోవైపు, దేశంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలతో తమకు సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆరెస్సెస్ ఖండించింది. తొంభై ఏళ్ళుగా సమాజంలో ఉన్న ఆరెస్సెస్‌ను దోషిగా నిలబెట్టేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సంస్థ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి విమర్శించారు. ఇదంతా ఓ పెద్ద కుట్రలో భాగమని అన్నారు. అన్ని వర్గాల నమ్మకాలను తాము గౌరవిస్తామని చెప్పారు. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని ఆరెస్సెస్ కోరుకుంటోందంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. దీనిపై మోహన్ భగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. అటు బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ భార్గవ ఆరోపణలపై స్పందిస్తూ, ఆయన నక్సలైట్ మద్దతుదారని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయ ప్రేలాపనలకు మీడియా అనవసర ప్రచారం కల్పిస్తోందని అన్నారు.