ప్రజలంతా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూంటే.. వాటిని కొనుక్కోవాలని తేల్చేసిన కేంద్రం.. ఇప్పుడు… తలా ఐదు కేజీల బియ్యం రెండు నెలల పాటు ఇస్తామని ప్రకటన చేసింది. ఇందు కోసం.. రూ. ఇరవై ఆరు వేల కోట్లు వెచ్చించబోతున్నట్లుగా ఘనంగా ప్రకటించింది. ప్రతీ నెలా ఇచ్చే రేషన్‌ను చాలా రాష్ట్రాలు.. రూ. ఒకటి.. రెండుకు పంపిణీ చేస్తున్నాయి. ఎక్కడా ఐదు రూపాయల కంటే ఎక్కువ ఉండదు. వాటిని ఉచితంగా ఇచ్చినా ఇవ్వకపోయినా.. ప్రజలకు పెద్దగా భారం పడదు. ఆ కొద్ది మొత్తం వారు కట్టుకోగలరు. కానీ.. ఆ బియ్యం ఇచ్చి రూ. ఇరవై ఆరు వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లుగా కేంద్రం ప్రచారం చేసుకుంటోంది. నిజానికి అంత పెద్ద మొత్తం పెడితే.. దేశంలో సగం మందికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయవచ్చు.
దేశంలోని ప్రజలందరికీ రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేయడానికి రూ. యాభై వేల కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా కేంద్రం స్పందించడం లేదు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విపణిలోకి టీకాలు రానున్నాయి. ఈ లోపే ఏదో ఒకటి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం… ఉచితంగా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించడం లేదు. గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు … లాక్ డౌన్ ప్రకటించారు. ఆ సమయంలో కూడా.. ఆహారధాన్యాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.
దానికి పీఎం గరీబ్ కల్యాణ్ యోజన అనే పథకం పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పథకాన్నే మరో రెండు నెలల పాటు కొనసాగించనునుంది. దారిద్య రేఖకు దిగువన ఉన్న 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తారు. ఆహారధాన్యాలను ఇవ్వొద్దని ఎవరూ అనరు కానీ.. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లుగా ప్రకటనలు చేయడం ఎందుకని.. ఆ మొత్తం వ్యాక్సిన్ల కోసం ఖర్చు పెట్టాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.