ఆర్.బి.ఐ.గవర్నర్ రఘురామ రాజన్ పై కొత్తగా రాజ్యసభలో అడుగుపెట్టిన భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనని తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాశారు. అంతేకాక ఆయన మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఆర్.బి.ఐ.గవర్నర్ పై విమర్శలు చేస్తున్నారు. దానిపై భాజపా నేతలు స్పందించడానికి వెనుకాడుతున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఎవరిపై కూడా వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయడం తాము ఆమోదించబోమని చెప్పి చేతులు దులుపుకొన్నారు.
ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రతినిధి ప్రశ్నించగా ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణలను గట్టిగా ఖండించకుండా, “అది మీడియాకి సంబంధం లేని పరిపాలానా సంబందమైన విషయామని నేను భావిస్తున్నాను. అయినా ఆ విషయం గురించి ఆలోచించడానికి ఇంకా సెప్టెంబర్ దాక సమయం ఉంది,” అని క్లుప్తంగా జవాబు చెప్పారు. ఆర్.బి.ఐ.గవర్నర్ పై స్వంత పార్టీ ఎంపి ఆరోపణలు చేస్తుండటం, వాటికి ప్రధాని నరేంద్ర మోడీ ఒక విదేశీ మీడియా- కి సంజాయిషీ చెప్పుకోవలసిరావడం రెండూ విచిత్రమే విస్మయం కలిగిస్తున్నవే.
ఆర్.బి.ఐ.గవర్నర్ రఘురామ రాజన్ పదవీ కాలం సెప్టెంబరులో ముగుస్తుంది. కానీ ఆయనని తక్షణమే ఆ పదవిలో నుంచి తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. స్వామి తనపై అంత తీవ్ర ఆరోపణలు చేస్తున్నా రఘురామ రాజన్ ఇంతవరకు స్పందించక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు, భాజపా నేతల, మోడీ ప్రభుత్వ మౌనం అన్నీ చూస్తుంటే ఈ వ్యవహారం పైకి కనిపిస్తునంత సామాన్యమైనదేమీ కాదని అనుమానం కలుగుతోంది.