బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి కేంద్రం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకం అని ప్రశంసించారు. అద్వానీతో ఫోన్ చేసి మాట్లాడినట్టు వెల్లడించారు. తమ సమకాలీకుల్లో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి అంటూ కొనియాడారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఆయన దేశానికి సేవ చేసేంత వరకూ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు.
అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన అద్వానీ డిప్యుటీ ప్రధాన మంత్రి స్థాయి వరకూ ఎదిగారు. హోం మంత్రిగానూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన చేపట్టిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చారు. ఆయన ఎంతో మందికి ఆదర్శనీయుడు అని మోదీ చెప్పుకొచ్చారు. ఎన్నో దశాబ్దాల పాటు ఆయన ప్రజాసేవ చేశారని ప్రశంసించారు. ఎప్పుడూ పారదర్శకంగా ఉండడంతో పాటు అందరినీ కలుపుకుపోతూ పని చేశారని అన్నారు. రాజకీయ విలువలకు ఆయన నిదర్శనం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అటల్ బిహారీ వాజ్పేయీ హయాంలో ఉప ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎల్కే అద్వానీ. ఆ తరవాత పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలూ తీసుకున్నారు. 1970 నుంచి 2019 వరకూ పార్లమెంట్లోని రెండు సభలకూ ప్రాతినిధ్యం వహించారు.
ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ప్రకటించారు ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు. 1970వ దశకంలో రెండు సార్లు బీహార్ సీఎంగా పనిచేశారు కర్పూరీ ఠాకూర్.. రాజకీయంగా అగ్రకులాలు ఆధిపత్యం వహించే బీహార్లో ఓబీసీల రాజకీయాలకు ఆయన నాంది పలికారు. మొదటిసారిగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ యేతర సోషలిస్టు నాయకుడు . భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతల్లో ఠాకూర్ 49వ వ్యక్తి కాగా.. 50వ వ్యక్తి అద్వానీ. అంతకు ముందు ప్రణబ్ ముఖర్జీకి 2019లో భారత రత్న ప్రకటించారు.