నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదానికి సరయిన నిర్వచనం చెప్పకపోతే ఐక్యరాజ్యసమితి తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోడి తన బ్రసెల్స్ పర్యటన సందర్భంగా హెచ్చరించారు. ఉగ్రవాదం అంటే ఏమిటో, ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను నిర్ధారించడానికి తగిన ప్రమాణికాలను ఐక్యరాజ్యసమితి నిర్వచించాలని కోరారు. ఇటీవల ఉగ్రవాదుల దాడులకు గురయిన బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరంలో ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి ఆయన మాట్లాడుతూ, “ఇంతవరకు జరిగిన యుద్ధాలలో కోల్పోయిన వారి కంటే చాలా ఎక్కువ మంది ప్రజలను మనం ఈ ఉగ్రవాదుల దాడులలో కోల్పోయాము. ఉగ్రవాదాన్ని సమర్ధంగా అణచివేసేందుకు దానికి సరయిన నిర్వచనం చెప్పమని మనం ఐక్యరాజ్యసమితిని చాలా కాలంగా కోరుతున్నాము. కానీ మన సూచనను అది పట్టించుకోకపోవడం వలన అమెరికా అందుకు చాలా భారీ మూల్యం చెల్లించింది. భారత్ తో సహా ప్రపంచంలో చాలా చేశాలు ఇంకా మూల్యం చెల్లిస్తూనే ఉన్నాయి. కనుక ఇప్పటికయినా ఉగ్రవాదులను, వారి సంస్థలను, వారికి ఆశ్రయం ఇస్తున్నవారి గురించి ఐక్యరాజ్యసమితి నిర్దిష్టంగా విధివిధానాలు ప్రకటించడం చాలా అవసరం లేకుంటే ఏదో ఒకనాడు అది తన ఉనికినే కోల్పోవచ్చును,” అని ప్రధాని నరేంద్ర మోడి హెచ్చరించారు.
ఆయన చేసిన సూచనను ఐక్యరాజ్యసమితి పాటిస్తే అది ముందుగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ గురించే ప్రస్తావించి దానిపై చర్యలకు సిద్దపడవలసి ఉంటుంది. అలాగే ఐసిస్ ఉగ్రవాదులకు పరోక్షంగా సహాయం అందిస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టర్కీ వంటి కొన్ని దేశాలపై కూడా కటిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అది సాధ్యం కాదు కనుకనే ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి మౌనం వహిస్తోంది. కనుక ఇప్పుడు మోడీ చేస్తున్న సూచనను కూడా అది పట్టించుకోకపోవచ్చును. ఐక్యరాజ్యసమితిని ప్రత్యక్షంగానో పరోక్షంగా అమెరికా చాలా ప్రభావితం చేస్తోంటుంది. కనుక అమెరికా అనుమతిలేనిదే అదేమీ చేయలేదు. పాకిస్తాన్ అందరికీ ఒక తలనొప్పిగా మారిందని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేసారు. అలాగే తను అమెరికా అధ్యక్షుడయితే ఉగ్రవాదులపై అణుబాంబులు ప్రయోగించడానికి కూడా వెనుకాడనని చెపుతున్నారు. కనుక ఆయన అమెరికా అధ్యక్షుడయితే ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం ఇస్తున్న దేశాలపట్ల ఆయన కటినంగా వ్యవహరించే అవకాశం ఉంది కనుక తదనుగుణంగా ఐక్యరాజ్యసమితి తీరు కూడా మారవచ్చునేమో? కనుక మోడీ అంతవరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది.