ఏది చేసినా అంగరంగ వైభోగంగా ఆధ్మాత్మిక సౌరభాలు వెదజల్లే అంతర్జాతీయ గురు శ్రీశ్రీశ్రీరవిశంకర్ వివాదాస్పద వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షం కావడం సరైందేనా? యమునాతీరంలో శ్రీరామరాజ్యం బాహుబలి సినిమా సెట్టింగులను తలదన్నే నిర్మాణాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అధికారిక సంస్థలు ఘోషించాయి. దేశభక్తి పేరిట నిరంతరం కీర్తించే భారత సైనికులను స్వామి వారి అనధికార వేదిక ఏర్పాట్లకోసం తరలించడంపై సీనియర్ అధికారులు బాధపడినా క్రమ శిక్షణ పాటించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొదట చివాట్లు పెట్టి తర్వాత పరిహారం కింద అయిదు కోట్లు అక్కడ పెట్టి అడుగుముందకేయాలని ఆదేశించింది. జైలుకైనా పోతాగాని పైసా ఫైన్ కట్టబోనని బెట్టుచేశారు స్వామీజీ. కాని సాయింత్రానికి నిర్వాహకులు దిగివచ్చి ముందు అడ్బాన్సు కింద పాతిక లక్షలు వుంచండి తర్వాత తక్కింది కట్టేస్తాం అని ఎలాగో ఒప్పింకున్నారు. ఈ పంచాయతీని చూసి ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ మొదటే సర్దుకున్నారు. చివరకు విదేశాల నుంచి రావలసిన అతిధులు జింబాబ్బే అద్యక్షుడు రాబర్ట్ ముగాబే శ్రీలంక అద్యక్షుడు సిరిసేన, ఆఫ్టన్ మాజీ అద్యక్షుడు కర్జారు, పాక్ మాజీ ప్రధాని గిలానీ వంటివారు కూడా మొహం చాటేశారు.ముగాబే అయితే హరారే విమానాశ్రయం నుంచి బయిలుదేరాక కూడా ఆలోచన మార్చుకున్నారు. దీనంతటి వల్ల ప్రతిష్ట పెరిగిందో తగ్గిందో తేలిగ్గానే అర్థమవుతుంది. కాని ఇవేవీ పట్టించుకోని ప్రధాని మోడీ మాత్రం స్వామీజీ పక్కన ఆసీనులై ఆకాశానికెత్తారు. పైగా మన ఘన సాంసృతిక వారసత్వాన్ని విమర్శిస్తారా అంటూ పరోక్షంగా వంత పాడారు. సాక్షాత్తూ దేశాధినేతలే వివాదగ్రస్త కార్యక్రమాలకు వంతపాడితే ఇక అధికారులు నోరు మెదపగలరా? లలిత్ మోడీకి సుష్మా వసుంధరలు, విజరు మాల్యాకు అరుణ్‌జైట్లీ రాజ్‌నాథ్‌లు ఇప్పుడు శ్రీశ్రీకి స్వయానా ప్రధాని. దేశభక్తి జాతీయ వాదం ఇలాగే వుంటాయా అని ఆశర్యపోకండి. నీతిబోధలతో తరించండి.