భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్, అ తరువాత ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మమణియన్, ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత్ దాస్ లపై విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేస్తూ వారిని ఆ పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలకి నొచ్చుకొన్న రఘురామ రాజన్ తను రెండవసారి పదవిలో కొనసాగానని ప్రకటించేశారు. స్వామి నోటికి బలైన మిగిలినవారు ఏమీ చేయలేక మౌనం వహించారు. ఆయన అంతగా రెచ్చిపోతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా హెచ్చరించకపోవడంతో ఇంకా రెచ్చిపోయి ఈసారి సాక్షాత్ కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశ్యించి “సూటుబూటు వేసుకొని హోటల్లో వెయిటర్ లాగ కనిపిస్తున్నారు” అని అనేయగలిగారు.
అప్పుడు ప్రధాని కూడా స్పందించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ‘టైమ్స్ నౌ’ విలేఖరి సుబ్రహ్మణ్య స్వామి విమర్శల గురించి అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెపుతూ, “ఈవిధంగా ఏ పార్టీలో జరిగినా అది సరికాదు. వ్యవస్థ కంటే వ్యక్తులు గొప్పవారుకారనే సంగతి గ్రహించాలి. ఒకవేళ ఎవరైనా ఆవిధంగా అనుకొంటే అది తప్పు. పబ్లిసిటీ కోసం ఒక వ్యవస్థలో వ్యక్తులని లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేయడం చాలా తప్పు. దాని వలన దేశానికి మేలు కలుగాకపోగా ఇంకా నష్టం జరుగుతుంది. అందరూ భాద్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. రఘురామ రాజన్ నిబద్ధతని, దేశభక్తిని శంఖించడానికి లేదు. ఆయన కూడా మనలాగే దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన భాద్యతలని చాలా సమర్ధంగా నిర్వర్తిస్తున్నారు,” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇదే మాటలు మొదటే చెప్పి ఉండే ఉంటే స్వామికి గట్టి హెచ్చరిక పంపినట్లు ఉండేది. ప్రజలకి, అధికారులకి సానుకూల సంకేతం పంపినట్లు ఉండేది. కానీ సుబ్రహ్మణ్య స్వామి నోటి దురుసుతో అనకూడని వాళ్ళందరినీ అనరాని మాటలన్నీ అనేసిన తరువాత ఇప్పుడు ఒక విలేఖరి ప్రశ్నించినపుడు మాత్రమే మోడీ తన అభిప్రాయం చాలా మృదువుగా చెప్పడం విశేషం.
దేశ ఆర్ధిక వ్యవస్థకి మూలస్తంభాల వంటి ఆర్ధిక మంత్రిని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆర్ధిక సలహాదారులని ఉద్దేశ్యించి సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణల వలన జరగరాని నష్టం జరిగింది. భారత్ లో రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్లపై కర్ర పెత్తనం చేస్తారనే సంకేతాలు పంపినట్లయింది. సుబ్రహ్మణ్య స్వామి నోరు జారుతున్నారని గ్రహించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనని గట్టిగా హెచ్చరించి ఉండి ఉంటే ఇంతగా పేట్రేగిపోయుండేవారే కాదు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామికి నేరుగా, గట్టిగా హెచ్చరిక చేయకుండా చాలా మృదువుగా మందలించడం గమనిస్తే నేటికీ ఆయన స్వామిని వెనకేసుకొని వస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది.