ఈరోజు ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు నేతాజీ సుబాష్ చంద్ర బోస్ 119వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి ఆయనకు సంబందించిన 100 రహస్య పత్రాలను, కొందరు మంత్రులు, నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో బహిర్గతం చేసారు.
సుభాస్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన 990 ఫైళ్ళను భారత రక్షణ శాఖ నేషనల్ ఆర్చివ్స్ శాఖకు అందజేసింది. ఆ తరువాత బోస్ మరణంపై సమగ్ర దర్యాప్తు కోసం హోం శాఖ ఏర్పాటు చేసిన కొసలా కమీషన్ మరియు జస్టిస్ ముఖర్జీ కమీషన్ తయారు చేసిన 1030 ఫైళ్ళతో కూడిన రెండు వేర్వేరు నివేదికలను 2012లో నేషనల్ ఆర్చివ్స్ శాఖకు అందజేయబడ్డాయి. వాటిని బహిర్గతం చేయమని బోస్ కుటుంబీకులు ప్రజలు ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ గత యూపీఏ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. వాటిని బహిర్గతం చేస్తే ఇరుగుపొరుగు దేశాలతో మన సంబంధాలు దెబ్బ తింటాయని చెప్పుకొచ్చింది తప్ప బహిర్గతం చేయలేదు.
ఆ కారణంగా బోస్ మరణంపై అనేక ఊహాగానాలు, పుకార్లు మొదలయ్యాయి. బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ లో 1985 వరకు కనబడిన గుమ్నామీ బాబాయే సుబాష్ చంద్ర బోస్ అని కొందరు నమ్మేవారు. మరికొందరు ఆయనని రష్యా ప్రభుత్వం జైల్లో బందించి చిత్రవధ చేసి చంపిందని, ఉరి తీసిందని, తీవ్రమయిన చలి ఉండే రష్యాలోని సైబీరియా జైల్లో ఆయనను బంధించడంతో తీవ్ర అనారోగ్యంతో చనిపోయారని, ఆ సంగతి అప్పటి ప్రధాని నెహ్రూకి తెలుసనీ కానీ బోస్ ని విడిపించి భారత్ కి తీసుకు వస్తే అధికారం కోసం తనకి పోటీగా తయారవుతారనే ఉద్దేశ్యంతో పట్టించుకోలేదని రకరకాల పుకార్లు, ఊహాగానాలు వినపడుతున్నాయి.
గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ ప్రభుత్వం అధీనంలో ఉన్న బోస్ కి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసారు. వాటిలో బోస్ మరణం గురించి వివరాలు తెలియలేదు. కానీ స్వాత్రంత్ర్యం వచ్చిన తరువాత సుమారు రెండు దశాబ్దాలపాటు బోస్ కుటుంబ సభ్యులపై దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయం బయటపడింది. అంటే బోస్ విషయంలో నెహ్రు భయాలు నిజమేనని భావించవలసి వస్తోంది. అదే నిజమయితే రష్యా జైల్లో బోస్ చనిపోవడం కూడా నిజమే అయ్యుండాలి. ఆ విషయం నెహ్రూకి తెలుసని భావించవలసి ఉంటుంది. బహుశః అందుకే కాంగ్రెస్ పార్టీ ఇన్ని దశాబ్దాలుగా ఆ రహస్య ఫైళ్ళను బహిర్గతం చేసేందుకు భయపడిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు ఆ రహస్య ఫైళ్ళను అన్నిటినీ మోడీ బహిర్గతం చేసారు కనుక బోస్ మరణం విషయంలో మిష్టరీ వీడే అవకాశం ఉంది.