ఎన్నికల ముందు సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే ఉంటుంది. అయితే, వచ్చిన ఈ బడ్జెట్ అవకాశాన్ని పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు మోడీ సర్కారు బాగానే ప్రయత్నించింది! మధ్య తరగతిని ఆకర్షించే పన్ను పరిమితి పెంపులాంటి కొన్ని మంచి నిర్ణయాలు ఉన్నాయి. కానీ, మోడీ అంటే అభివృద్ధి అనే నినాదంతో గత ఎన్నికల్లో గెలిచి… ఆ అభివృద్ధి ఏం సాధించారో, మున్ముందు ఈ బడ్జెట్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో వివరించలేకపోయారు. ఈ బడ్జెట్ లో అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే… ఉపాధి కల్పనకు ప్రాధాన్యత దక్కకపోవడం. నిర్మాణ రంగం, వస్తు తయారీ రంగంతోపాటు ఇతర రంగాలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత లేనేలేదు.
గడచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా… దేశంలో గత ఏడాది 6.1 శాతం నిరుద్యోగం ఉందని నేషనల్ శాంపిల్ సర్వే తాజాగా స్పష్టం చేసింది. పట్టణ ప్రాంత మహిళల్లో 27.2, పురుషుల్లో 18.7 శాతం నిరుద్యోగం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 13.6 శాతం మహిళలు, 17.4 శాతం పురుషుల నిరుద్యోగ శాతం నమోదైంది. అంటే… ఉద్యోగాల కల్పన, పారిశ్రామికాభివృద్ధిలో దేశం ఎంతగా వెనకబడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమల విస్తరణకు బ్యాంకులు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం లేదు. కారణం, వేల కోట్లలో డబ్బులు ఎగ్గొట్టినవారిపై మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే. దేశంలో 17 జాతీయ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి. దీంతో పరిశ్రమలకు వర్కింగ్ కేపిటల్ కూడా బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి. ఫలితంగా పరిశ్రమల విస్తరణ జరగడం లేదు, ఉపాధి పెరగడం లేదు.
అసంఘటిత రంగం తీసుకుంటే… పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ పరిశ్రమలకు కూడా అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు భయపడుతున్న పరిస్థితి. దీంతో ఉపాధి మార్గాలు కనిపించక, నిరుద్యోగ యువత తీవ్ర అసహనంతో ఉన్నారు. వీరి సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందే లేదు. గత ఎన్నికల ముందు మోడీ వస్తే దేశం పారిశ్రామికంగా దూసుకుపోతుందనీ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అనుకున్నారు. కానీ, గడచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు దేశంలో ఉంది. దీనికి కారణం ముమ్మూర్తులా మోడీ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు, బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలు… ఇవన్నీ మోడీ సర్కారు వైఫల్యాలు. వీటిని కవర్ చేసుకోవడం కోసం పైపై మెరుగులు దిద్దుతూ ఓ బడ్జెట్ ను ఇవాళ్ల ప్రవేశపెట్టారు. ఎన్నికల ప్రచారానికి ఇది పనికొచ్చినా, యువతలో అసంతృప్తిని తగ్గించలేదన్నది వాస్తవం.