భారీ వర్షాలతో అతలాకుతం అవుతున్న తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం, ఇరుగుపొరుగు రాష్ట్రాలు, చిత్ర సీమ అందరూ బాసటగా నిలుస్తున్నారు. కేంద్రప్రభుత్వం తక్షణమే రూ.940 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే చెన్నై బయలుదేరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. గత నాలుగయిదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలో మొత్తం 269 మంది మరణించినట్లు హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాల సహాయ పడుతోందని, అవసరమయితే ఇంకా అదనపు సహాయం అందించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.
ప్రస్తుతం చెన్నైలో ఆర్మీ, నావికాదళం సహాయ చర్యలలో పాల్గొంటున్నాయి. ఎన్.డి.ఆర్.ఎఫ్.కు చెందిన 1200 మంది సిబ్బంది, 100 బోట్లు కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇంతవరకు సుమార్ 70,000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నై విమానాశ్రయంలో 1,500 మంది చిక్కుకొని పోయారు. విమానశ్రయం రన్ వే పై కూడా నీళ్ళు ప్రవహిస్తుండటంతో విమానాలు రద్దయ్యాయి. రైళ్ళు, బస్సులు ఇంతకు ముందే రద్దయ్యాయి. తమిళనాడుని ఆనుకొని ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో కురుస్తున్న భారీ వానల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం జరిగిందని రాజ్ నాద్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణ సహాయంగా రూ.330 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.