కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే, జె.డి.ఎస్. విషయంలో అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడం కీలకమైన మార్పే! నిజానికి, ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ వెర్సెస్ భాజపాల మధ్యనే ఉన్నప్పటికీ… జె.డి.ఎస్. నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉందనే అంచనాలు ముందు నుంచీ ఉన్నాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయి సంఖ్యాబలాన్ని దేవెగౌడ సాధించుకోలేకపోయినా, ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చి, ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా నిలుస్తారనే అంచనాలున్నాయి. అయితే, భాజపాతో దేవెగౌడ అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నారనీ, కుమారస్వామిని ముఖ్యమంత్రి చేసేందుకు భాజపా మద్దతు ఇస్తుందనే అంచనాలు చాలా ఉన్నాయి. కర్ణాటకలో సొంతంగా మెజారిటీ సాధించలేని పక్షంలో, జేడీఎస్ కి మద్దతు ఇవ్వడం ద్వారా పట్టు నిలుపుకోవాలన్నది భాజపాకి ఉన్న ప్లాన్ బి!
అయితే, నిన్న తుముకూరులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జె.డి.ఎస్.పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీతో దేవెగౌడ లోపైకారీ ఒప్పందం కుదిరిందన్నారు. సిద్ధరామయ్యది అవినీతి సర్కారు అనీ, ఆయనతో జేడీఎస్ కుమ్మక్కు అయిపోయిందని ఆరోపించారు. కర్ణాటక అభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యమన్నారు. అయితే, మోడీ మాటలు వినగానే… ఇప్పుడు భాజపా కూడా జేడీఎస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందా, ప్రత్యర్థి పక్షంగా చూస్తోందా అనే అంచనాకి రాలేం! ఎందుకంటే, భాజపా ప్లాన్ బికి పనికొచ్చే జేడీఎస్ ను అంత సులువుగా తూలనాడే పరిస్థితి భాజపాకి లేదు. కాబట్టి, మోడీ వ్యాఖ్యల వెనక వేరే మర్మం ఉందనే అనిపిస్తోంది.
భాజపా, జేడీఎస్ లు కుమ్మక్కయ్యాయన్న ప్రచారం జోరుగా ఉంది కదా! దీంతో కొంతమంది లౌకికవాదులు జేడీఎస్ కి దూరంగా జరుగుతూ.. కాంగ్రెస్ కి ఓటెయ్యాలని నిర్ణయించుకున్నారన్న అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. అంటే, భాజపాతో దేవెగౌడ రహస్య ఒప్పందం అనే వార్తలు ఇంకా పెరిగితే… జేడీఎస్ కి సీట్లు తగ్గుతాయి. ఆ మేరకు కాంగ్రెస్ కు ప్లస్ కావొచ్చు. ఒకవేళ, జేడీఎస్ కి సీట్లు తగ్గితే, భాజపాకీ సరైన నంబర్ రాకపోతే.. భవిష్యత్తులో ఈ రెండూ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే శక్తి సరిపోకపోవచ్చు. కాబట్టి, జేడీఎస్ కొంత బలంగానే ఉండాలి. భాజపాపై ఉన్న వ్యతిరేకత వల్ల ఆ పార్టీకి సీట్లు తగ్గకూడదు! సో… జేడీఎస్ కి సీట్లు తగ్గకుండా ఉండాలంటే… దేవెగౌడ తమతో కుమ్మక్కు కాలేదూ, కాంగ్రెస్ తో కలిసిపోయారనే ప్రచారాన్ని ప్రధాని మోడీ తెర మీదికి వ్యూహాత్మకంగానే తెచ్చినట్టు భావించాలి. ఇప్పటికే రాష్ట్రంలో భాజపాకి ఎదురుగాలి బాగా ఉంది. ఎన్నికల ఫలితాలు తేడా కొట్టి, కనీసం గోవా తరహాలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా.. ఆ మేరకు ఉన్న అవకాశాలను ఇప్పట్నుంచే కాపాడుకుంటూ రావాలి. సో.. ‘ప్లాన్ బి’ని కాపాడుకోవడం కోసమే తమ రహస్య మిత్రుడైన దేవెగౌడను, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారనే కొత్త ప్రచారానికి మోడీ తెర లేపారు.