కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తెలుగు ప్రజలంటే డిల్లీ పెద్దలకు ఎప్పుడూ చులకన భావం ప్రదర్శిస్తుంటారు. తెలుగు ప్రజలు వారిని నెత్తిన పెట్టుకొని గౌరవిస్తున్నందుకు, వారిని ఆదరించకపోగా చులకనగా చూస్తుంటారు. ప్రత్యేక హోదా, నిధులు, హామీల అమలు విషయంలో ఏపిని, హైకోర్టు విభజన, నిధులు, ప్రాజెక్టులు మంజూరు విషయంలో తెలంగాణా పట్ల కేంద్రం ఏవిధంగా వ్యవహరిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ విధంగా వ్యవహరించడం వలన తెలుగు ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలిసీ కూడా కేంద్రం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండేళ్ళు పూర్తయినా ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో అడుగుపెట్టలేదు కనుక ఆయన నోట తెలుగు రాష్ట్రాల పేర్లు వినపడటం కూడా చాలా గొప్ప వార్తగానే చెప్పుకోవలసి వస్తోంది.
‘మన్ కి బాత్’ పేరిట ఆయన ప్రతీనెల రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతుంటారు. నిన్న ఆదివారం ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతున్నాయని మెచ్చుకొన్నారు. రెండు రాష్ట్రాలు జలవనరుల సంరక్షణ కార్యక్రమాన్ని ఒక మహా యజ్ఞంలా చేపట్టాయని అభినందించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు వాటిని ఆదర్శంగా తీసుకొని నీటిని కాపాడుకోవాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని, తన ప్రభుత్వం శాశ్విత కరువు నివారణ కోసం కృషి చేస్తోందని తెలిపారు.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల గురించి మోడీకి వివరించి సహాయం అడిగినప్పుడు, మోడీ ఆయనకి ఏమైనా హామీ ఇచ్చారో లేదో తెలియదు. కానీ ‘బాబు బ్రీఫ్డ్ మి’ అని ట్వీటర్ లో చిన్న సందేశం పెట్టారు. మళ్ళీ నిన్న తన రేడియో ప్రసంగంలో రెండు రాష్ట్రాలలో కరువు పరిస్థితుల గురించి ఓ ముక్క చెప్పి, ఇద్దరు ముఖ్యమంత్రులను మెచ్చుకొన్నారు. ఆయన నోట తెలుగు రాష్ట్రాల పేర్లు వినబడ్డాయి కనుక దానితో సంతృప్తి చెందాలేమో? దానికే సంతోషపడాలేమో?