ఎవరైనా ప్రత్యర్థిని పడగొడతారు..! కానీ మోడీ మాత్రం తెలంగాణలో బీజేపీని పడగొట్టేశారు..!. రెండు, మూడు మాటలతో.. కేసీఆర్ కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో పారబోయే గోదావరి నీటిలో తెలంగాణ భారతీయ జనతా పార్టీని కొట్టుకుపోయేలా చేశారు. కేసీఆర్పై అరచి, గీ పెట్టి.. నానా తంటాలు పడి.. తాము చేస్తున్న పోరాటాన్ని.. పూచిక పుల్లల మోడీ తీసి పారేయడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు అస్సలు భరించలేకపోతున్నారు. అసలు తెలంగాణలో బీజేపీనే లేదన్నట్లుగా మోడీ పార్లమెంట్ లో .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పొగిడేయడమే ఇప్పుడు వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది.
అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కార్నర్ చేయాలనుకున్నారు. తనతో ఎలాగూ పోల్చుకోలేరు కాబట్టి… తెలంగాణ ముఖ్యమంత్రితో చంద్రబాబును పోల్చారు. చంద్రబాబును తక్కువ చేయడానికి కేసీఆర్ అభివృద్ధి కాముకుడని కీర్తించారు. అద్భుతంగా పని చేస్తున్నారని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ప్రగతిశీల విధానాల పాటిస్తున్నారని చెప్పేశారు. మోడీ నోటి నుంచి వచ్చిన ఈ మాటలు తెలంగాణ బీజేపీకి మరణశాసనం గా మారడం ఖాయమన్న అభిప్రాయాలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ విడత బస్సు యాత్ర చేసి… టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేశారు. కేంద్రమంత్రులు కూడా.. వచ్చి కేసీఆర్ పరిపాలన అధ్వాన్నంగా ఉందని విమర్శించి వెళ్లారు. రామ్ మాధవ్ వచ్చి… “మగతనం” విమర్శలు చేసి వేడి పెంచారు. ఇక దూకుడే అనుకున్న తెలంగాణ బీజేపీ నేతలకు… మొన్న ఏమీ మాట్లాడకుండా అమిత్ షా.. ఇప్పుడు అన్నీ మాట్లాడి.. మోడీ… చాపచుట్టేసుకునేలా చేశారు.
లక్ష్మణ్ బస్సు యాత్ర పూర్తి చేసిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా .. ఒక రోజు పర్యటనకు హైదరాబాద్ వచ్చారు. ఆయన బేగంపేట విమానాశ్రయంలోనే ఓ సభ ఏర్పాటు చేశారు. కానీ అమిత్ షా.. హైదరాబాద్ లో నోరు తెరవలేదు. పైగా కార్యకర్తల సమావేశంలో అధికారంలోకి వస్తాం.. దున్నేస్తాం.. లాంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసి వెళ్లారు. అప్పుడే వారికి ఉత్సాహం చల్లబడిపోయింది. ఇప్పుడు మోడీ వారిని పూర్తిగా విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చేశారు.
మిత్రులు ఒక్కొక్కరుగా దూరమవుతుంటే.. బీజేపీకి ఉపిరి సలపని పరరిస్థితి ఏర్పడింది. తనపై ఆశలు పెట్టుకోవద్దని శివసేన చేతలతోనే తేల్చి చెప్పింది. ఉత్తరాదిలో తగ్గే 150 సీట్లను.,. దక్షిణాదిలో కవర్ చేసుకోవాలని బీజేపీ ఆశ పడుతోంది. సొంతంగా కాకపోయినా.. టీఆర్ఎస్ లాంటి రహస్య మిత్రుల ద్వారా ఈ లక్ష్యం సాధించాలనుకుంటోంది. అందుకే టీఆర్ఎస్కు మోదీ బిస్కెట్ వేశారు. ఆ బిస్కెట్ .. తెలంగాణ బీజేపీ గొంతులో ఇరుక్కుంది. ఇక ఊపిరి ఆడటం కష్టమే.