నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కేంద్రప్రభుత్వం నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా సమీక్షించేందుకు “ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్” క్లుప్తంగా ‘ప్రగతి’ అనే విధానాన్ని ప్రారంభించారు. ఈ విధానంలో ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా ఆయా రాష్ట్రాలలో ఆ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్సింగ్ పద్దతిలో మాట్లాడి ఆయా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తుంటారు. ప్రతీనెల ఆఖరివారంలో బుదవారం నాడు ఈ ప్రగతి టెలీకాన్ఫరెన్సింగ్ నిర్వహిస్తుంటారు. మోడీతో బాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇవ్వాళ్ళ డిల్లీ నుండి నిర్వహించిన ఈ ప్రగతి సమీక్షా కార్యక్రమంలో ప్రధాని మోడీ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. ఆ ప్రాజెక్టులో సాధకబాధకాలను కనుగొని, సంబంధిత అధికారులకు అవసరమయిన సూచనలు ఇచ్చేరు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వీలయినంత త్వరగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని ఆదేశించారు.
ప్రధాని మోడి ఇవ్వాళ్ళ సమీక్షించిన ప్రాజెక్టులలో పోలవరం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దానిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రమే దానిని నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఈరోజు ఆయన సమీక్షించిన ప్రాజెక్లు: 1. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు. 2. ఈస్ట్రన్ డెడికేటడ్ ఫ్రైట్ ప్రాజెక్టు. 3. డిల్లీ-హర్యానా-ఉత్తరప్రదేశ్ మధ్య హైవే రోడ్ నిర్మాణం. 4. కాలదన్ మల్టీ మోడల్ ట్రాన్సిస్ట్ ప్రాజెక్టు. 5. మయన్మార్ దేశంలో భారత్ చేపడుతున్న రిహ్-తెడిం రోడ్డు మార్గం నిర్మాణం.6. ఎండ్-టు-ఎండ్ కంప్యూటరైజేషన్ టార్గెటడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం 7. ఎం.ఎన్.ఆర్.జి.ఈ.జి.ఏ. పధకం క్రింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టం. ఇవేకాక ఇంకా మరికొన్ని ఇతర ప్రాజెక్టులను కూడా మోడీ ఈరోజు సమీక్షించారు.