ప్రధాని నరేంద్ర మోడి ఈరోజు బిహార్ పర్యటనలో ఒక రైల్వే ప్రాజెక్టుని ప్రారంభిస్తూ “యూపియే ప్రభుత్వం పదేళ్ళపాటు నిర్లక్ష్యం చేయడంవలన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.600 కోట్లు నుండి ఏకంగా రూ. 3,000 కోట్లయింది. అది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. దేశాభివృద్ధికి బిహార్ అభివృద్ధి చాలా కీలకమని నేను భావిస్తున్నాను,” అని మోడీ అన్నారు.
మోడీ చెప్పిన మాటలను పోలవరం ప్రాజెక్టుకి కూడా అన్వయించుకొన్నట్లయితే, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా యూపియే ప్రభుత్వం చేసిన తప్పునే కొనసాగిస్తోందని చెప్పక తప్పదు. ఎన్నికల ప్రచార సమయంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత తమదేనని చెప్పిన మోడీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి వంద కోట్లు చొప్పున రెండేళ్లలో దానికి కేవలం రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించారు.
కనీసం ఐదారు వేల కోట్లు కేటాయిస్తే తప్ప ఆ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోదని తెలిసి ఉన్నపుడు ఈవిధంగా చిల్లర విదిలిస్తుంటే అది కాస్తా పప్పు బెల్లాల పద్దులో ఖర్చయిపోతోంది. ఆ కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దానివలన నిర్మాణ వ్యయం కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రజాధనం వృదా అవ్వకూదదని మోడీ భావిస్తున్నట్లయితే దానికి సరిపడా నిధులు కేటాయించాలి. కానీ కేటాయించడం లేదు? బిహార్ ప్రాజెక్టులకి వర్తించిన నియమం ఆంధ్రాలో ప్రాజెక్టులకి ఎందుకు వర్తింపజేయరు? బిహార్ లో ప్రజాధనం వృధా అయినా ఆంధ్రాలో అయినా దాని వలన దేశానికే నష్టం కలుగుతుంది.
భాజపాకి శతృవులయిన కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ లతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతులు కలిపి సాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడి తమ పార్టీ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నితీష్ కుమార్ ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయాసపడుతున్నట్లున్నారు. ఏపిలో చంద్రబాబు నాయుడు ఆయనకు సన్నిహితుడు, కేంద్రప్రభుత్వంలో, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పటికీ మోడీ ఆయనను పట్టించుకోరు. ఆయన మాటకు ఏమాత్రం విలువివ్వరు. బిహార్ అభివృద్ధికి తను చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు మోడీ చెప్పడం చాలా అభినందనీయం. కానీ ఆంధ్రాకి కూడా ఎందుకు ప్రాధాన్యత నీయడం లేదు? అని రాష్ట్ర ప్రజలు అందరికీ సందేహం కలుగుతోంది. మోడీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించడం తప్పు కాదు కానీ ప్రాజెక్టులని కూడా అదే దృష్టితో చూడటమే తప్పు.