దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ మరింత ఆజ్యం పోశారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక ఎంతో అవసరం ఉందని తాజాగా ప్రకటించారు. దేశంలో ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని.. ఈ కారణంగా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. అందుకే ఒకే దేశం- ఒకే ఎన్నికపై అధ్యయనం చేయాల్సిందేనన్నారు. అలాగే పంచాయతీ నుంచి లోక్సభ వరకు వేర్వేరు ఓటర్ల జాబితా అనవసరమని.. ఒకే జాబితా ఉండాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేయాల్సిందేనని మోదీ అన్నారు కానీ.. కేంద్రం ఇప్పటికీ దీనికి సంబంధించిన కసరత్తును కూడా దాదాపుగా పూర్తి చేసింది. గతంలోనే అన్ని పార్టీల అభిప్రాయాల్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఒకే ఓటరు జాబితాపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కార్యాచరణ కూడా చేపట్టింది. అదే సమయంలో.. రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి జమిలీ ఎన్నికల గురించి స్పష్టమైన సంకేతాలు పంపారు. అయితే కరోనా కారణంగా కేంద్రం జమిలీ ఎన్నికల ఆలోచన వాయిదా వేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతూ వచ్చింది. కానీ.. అలాంటిదేమీ లేదని మోడీ తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతోందంటున్నారు.
బీజేపీ నేతలతో పాటు.. ఆ పార్టీకి సన్నిహితులుగా ఉంటున్న వారు పెద్ద ఎత్తున జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. వారం రోజుల కిందట.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. 2024 కంటే ముందే జమిలీ ఎన్నికలు వస్తాయని తనకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. అలాగే మరికొంత మంది నేతలు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ పెద్దలు కూడా తరచూ ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రి మోదీనే జమిలీ ఎన్నికల ప్రస్తావన తేవడంతో రాజకీయ రంగంలో కదలిక రావడం ఖాయమని చెప్పుకోవచ్చు.