ప్రధాని నరేంద్ర మోడి జనవరి 16 నుంచి ‘స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా’ అనే మరో కొత్త పధకం మొదలుపెత్తబోతున్నట్లు ప్రకటించారు. ఈ పధకం ద్వారా ఉత్పత్తి, సేవా, వ్యవసాయ లేదా మరే ఇతర రంగాలలో దేశంలో ఔత్సాహికులయిన యువతకు ఆయా రంగాలలో తమ సృజనాత్మక ఆలోచనలను దేశ వ్యాప్తంగా తమ వంటి ఔత్సాహికులయిన యువతతో పంచుకొని, తమ కలలను సాకారం చేసుకోవడానికి ‘లైవ్ కనెక్ట్’ ద్వారా అనుసంధానం అయ్యే అవకాశం కల్పించబడుతుంది. దేశంలో సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి ఉన్నత విద్య సంస్థలలో విద్యార్ధులకు ఈ సౌకర్యం కల్పించబడుతుంది. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని జనవరి 12 నుండి 16వరకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రాయ్ పూర్ జరిగే వేడుకలలో ఈ పధకం కోసం నిర్దిష్టమయిన కార్యాచరణ ప్రకటిస్తానని ప్రధాని నరేంద్ర మోడి నిన్న ‘మన్ కి బాత్’ అనే రేడియో కార్యక్రమంలో తెలిపారు.