ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగబోయే కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో అప్పుడే ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడి సిద్దమయిపోతున్నారు. మంగళవారం ఆయన ఆ రెండు రాష్ట్రాలలో పర్యటించబోతున్నారు. కేరళలోని కోజిక్కోడ్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొన్న తరువాత, అక్కడి నుండి తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకొని అక్కడ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఉత్తరభారతంలో చాలా మంది ప్రజలకు హిందీ అర్ధం చేసుకోగలరు కనుక మోడీ వారిని ఆకర్షించి, ప్రబావితం చేసే విధంగా అనర్గళంగా మాట్లాడి ఒప్పించగలుగుతారు. కానీ మోడీ వంటి మంచి వాగ్ధాటి గల నేతలకి కూడా దక్షిణ భారతదేశంలో బాషే ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంది. వారు చెప్పిన దానిని అనువాదకులు స్థానిక బాషలోకి అంతే సమర్ధంగా అనువదించి ఆకట్టుకోవడం కొంచెం కష్టమే కనుక ఉత్తరాది ప్రజలపై చూపినంత ప్రభావం దక్షిణాది ప్రజలపై చూపడం కష్టం.
ఇక తమిళనాడు, కేరళలో చాలా కాలంగా రెండే పార్టీలు, కూటములు అధికారం చెలాయిస్తున్నాయి. ఏ పార్టీ అయినా వాటితో చేతులు కలిపి మనుగడ సాగించాల్సిందే తప్ప వాటిని డ్డీ కొని ఓడించిన దాఖలాలు లేవు. తమిళనాడులో అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలు, కేరళలో వామపక్షాల నేతృత్వంలో లెఫ్ట్ డెమొక్రేటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రేటిక్ ఫ్రంట్ చేతుల్లోనే అధికార మార్పిడి జరుగుతుంది. కనుక ఆ రెండు రాష్ట్రాలలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడి బీజేపీని గెలిపించడం మాట అటుంచి, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోతే కనీసం గౌరవప్రదమయిన స్థానాలు సంపాదించుకోవడం కూడా కష్టమే. మరి ఈ పరిస్థితులలో ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ రెండు రాష్ట్రాలలో ఏవిధంగా నెగ్గుకు వస్తారో చూడాలి.