భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ గాడిన పడుతున్నట్లున్నాయి. కానీ అవి ఎంత కాలం సక్రమంగా కొనసాగుతాయనే విషయం మాత్రం పాక్ వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది. ఈలోగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ పై మళ్ళీ దాడులకు తెగబడినా లేదా పాక్ సైనిక దళాలు సరిహద్దులలో కాల్పులకు తెగబడినా పరిస్థితి మళ్ళీ మొదటికి రావచ్చును. అయినా భారత్ తరపున ప్రయత్నలోపం లేకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్దరణకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ కొరకు మళ్ళీ ఉన్నతస్థాయిలో చర్చలు ఆరంభించాలని వారు సూత్రప్రాయంగా అంగీకరించారు.
వచ్చే ఏడాది ఇస్లామాబాద్ లో జరుగనున్న సార్క్ దేశాల సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడి హాజరవుతారని సుష్మ స్వరాజ్ చెప్పినట్లుగా భారత్, పాక్ మీడియాలో వార్తలు వచ్చేయి. ఇదివరకు రష్యాలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసినపుడే తను ఆ సమావేశానికి హాజరవుతానని ప్రధాని నరేంద్ర మోడి చెప్పారు. కనుక మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని భావించవచ్చును. కానీ ఈ సానుకూల వాతావరణం చెదిరిపోకుండా ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఇరు దేశాలకీ కూడా తెలియదు.