పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి జరిగిన ఐదు రోజుల వరకు అక్కడ భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టి ఉగ్రవాదులందరినీ ఏరిపారేసాయి. రెండు రోజుల క్రితమే రక్షణమంత్రి మనోహర్ పారికర్ పఠాన్ కోట్ వెళ్లి అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఇవ్వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడి కూడా పఠాన్ కోట్ వెళుతున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పఠాన్ కోట్ అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ప్రధాని ఈరోజు తన పర్యటనలో ఉగ్రవాదుల దాడిలో గాయపడి మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులని కలిసి ప్రాణాలొడ్డి ఉగ్రవాదులతో పోరాడినందుకు వారిని అభినందిస్తారు. ప్రధాని మోడీ ఈరోజు పర్యటనలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉన్న భద్రతా వ్యవస్థలపై భారత వాయుసేన, ఆర్మీ, ఇంటలిజన్స్, ఎన్.ఎస్.ఏ. మరియు పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులతో పఠాన్ కోట్ లో ఒక సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.