మోడీ హవా… ఇది గత ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రాలో కూడా కొంత కనిపించింది. అప్పటి పరిస్థితుల్లో.. మోడీ వినా విభజిత రాష్ట్రానికి కేంద్రంలో సాయం చేయగలిగేవారు ఉండరనే జడ్జిమెంట్ కు ఆంధ్రా ప్రజలు వచ్చారు. అదే నమ్మకంతో నాలుగేళ్లు వేచి చూశారు. కానీ, ఇప్పుడా మోడీ హవాపై ఆంధ్రాలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోడీ సర్కారు విఫలమైందన్న వ్యతిరేకత పెరుగుతోంది. ఈ సెగలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తగిలాయన్నది వాస్తవం. వారి దృష్టిలో ఆంధ్రా అంటే కొన్ని అంకెల లోక్ సభ స్థానాలే అనిపించినా… వ్యతిరేకతను నివారించకపోతే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడుతుందన్నది వాస్తవం. ఎందుకంటే, ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చంతా ఆంధ్రాకి కేంద్రం చేసిన అన్యాయమే! కాబట్టి, దిద్దుబాటు చర్యలకు స్వయంగా మోడీ దిగుతున్నారు. త్వరలో ఆయన ఆంధ్రాకు రాబోతున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాయం సమరం రాజుకున్న వేళ… ఆంధ్రాకు వచ్చేందుకు మోడీ ఆసక్తి చూపుతున్నారంటూ పీఎంవో నుంచి ఏపీకి సంకేతాలు రావడం విశేషం. అందుకు అనువైన సందర్భాలు ఏవైనా ఉన్నాయంటూ ఆరా తీస్తోంది. అంటే, ప్రధాని స్థాయిలో ప్రారంభించాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన శంకుస్థాపనలు వంటివి ఏవైనా ఉంటే ఆ జాబితాను పీఎంవో కోరిందని సమాచారం. బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో ముఖ్యమంత్రి నిమగ్నమై ఉండగా, దీనికి సంబంధించిన సమాచారం ఢిల్లీ నుంచి వచ్చిందని అధికారులు ఆయనకు వివరించారు. అయితే, ప్రధాని ఎప్పట్లోగా ఆంధ్రాకు రావాలనుకుంటున్నారు..? మార్చి 5లోగా ఆయన వచ్చే అవకాశం ఉందా అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
నిజానికి, గడచిన ఏడాదిగా ఏపీ ముఖ్యమంత్రిని కలిసేందుకే ఆయన ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది. ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇవ్వలేదనే విమర్శలూ ఆ మధ్య వినిపించాయి. అంతేకాదు, పోలవరం లాంటి కీలకమైన అంశాలు వివాదాస్పదం అవుతున్న సమయంలో కూడా కేంద్రమంత్రుల స్థాయి వరకూ స్పందించారు తప్ప, ప్రధానమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని మాట్లాడింది లేదు. అన్నిటికీమించి.. తాజా బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ రాష్ట్రమంతా గొంతెత్తినా కూడా ప్రధాని నేరుగా స్పందించింది లేదు. దీంతో ఆంధ్రాలో మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇన్ని జరిగిన తరువాత… ఇప్పుడు ఆయనే ఆంధ్రాకు వస్తానంటూ, అందుకు అనువైన సందర్భాలు వెతుక్కోవడమంటే.. ఇది దిద్దుబాటు చర్యగానే చూడాలి.
ఆయనే వస్తారని డిసైడ్ అయితే ఏదో ఒక శంకుస్థాపనో, ప్రారంభోత్సమో ఉండకపోదు. కానీ, వచ్చాక… ‘నా మనసులో ఆంధ్రా ఉంది, ఆలోచన అంతా తెలుగు ప్రజల కోసమే’ ఇలాంటి ఎమోషనల్ అంశాలు మాట్లాడి మాటల గారడీతో శాంతింపజేద్దామనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోదు! రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్టు మట్టి తెచ్చాను, పవిత్ర జాలాలు తెచ్చాను అని వెళ్లిపోయినా ఇప్పుడు రగుతున్న వ్యతిరేకతకు ఆజ్యం పోసినట్టే అవుతుంది. విభజన హామీలపై స్పష్టమైన ప్రకటనలు, కార్యాచరణ ప్రణాళిక ఏదైనా ప్రకటిస్తే… మోడీ వ్యతిరేక హవాకి కొంత చల్లార్పులా పనిచేయ్యొచ్చు.