‘మాపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వండి. దేశాన్నే మార్చాం.. తెలంగాణని మారుస్తాం. తెలంగాణలో భాజపా సర్కారు వస్తే… మీతో కలిసి నడుస్తా. నా మీద మీకు పూర్తి అధికారం ఉంటుంది. మీ కలలు నిజం చేయడం కోసం వెనక్కి తగ్గేది లేదు’ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వారసత్వ రాజకీయాలు’ అనే కాన్సెప్ట్ ను ప్రముఖంగా తీసుకుని మోడీ ప్రసంగించారు. ఓపక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భాజపాని కేంద్రం నుంచి గద్దె దించాలన్న ప్రచారం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో… అదే ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు ప్రమాదం అనే వాదనతో తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు.
టీడీపీ గురించి మాట్లాడుతూ… తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారనీ, కానీ దాన్ని కాంగ్రెస్ కి తాకట్టు పెట్టేశారని మోడీ విమర్శించారు. తెలుగుదేశం కుటుంబ పార్టీ అన్నారు. తెరాస కూడా కేవలం ఒక కుటుంబ సభ్యుల పార్టీ అనీ, కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనీ, తరతరాలుగా ఒక ఫ్యామిలీకి మాత్రమే అక్కడ అధికారమన్నారు. చివరికి మజ్లిస్ కూడా కుటుంబం నేతృత్వంలోనే ఉందన్నారు. ఇలాంటి వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యం అస్థిత్వాన్ని దెబ్బతీస్తాయని ఎప్పుడో మన పెద్దలు చెప్పారన్నారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ తెలంగాణలో గడచిన ఐదు సంవత్సరాలు వృథాగా పోయాయన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తు కోసం జరుగుతున్నాయనీ, బంగారు భవిష్యత్తు భాజపాతో మాత్రమే సాధ్యమన్నారు మోడీ. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలన్నారు. కేసీఆర్ కి చంద్రబాబు ఒక గురువనీ, సోనియా గాంధీ మరో గురువన్నారు. భాజపాకి తెరాస బీ టీమ్ అని రాహుల్ అంటున్నారనీ, ఆయన ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలీదని ఎద్దేవా చేశారు. తెరాస, కాంగ్రెస్ లు ఒకే భావజాలంతో ఉంటాయనీ, ఆ రెండూ కుటుంబ పార్టీలన్నారు. కర్ణాటకలో జేడీఎస్ ని కూడా తమ బి టీమ్ అన్నారనీ, కానీ అక్కడి ఎన్నికల తరువాత జేడీఎస్ తో కలిసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు మోడీ. మైనారిటీల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ… అవి పెంచే అవకాశం లేదనీ, ఇతర కులాలూ దళితులూ ఓబీసీల వాటాలు లాక్కుని మైనారిటీలకు ఇవ్వాలని చూస్తున్నారంటూ మోడీ వ్యాఖ్యానించారు. ఆ తరువాత, కేంద్ర పథకాలు, భాజపా పాలనలో విజయాలు అంటూ కొన్నింటి గురించి ప్రధాని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల్లో ఇంతవరకూ మజ్లిస్, అభివృద్ధి.. ఈ రెండు అంశాలనే ప్రధానంగా చేసుకుని భాజపా ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు కొత్తగా కుటుంబ పాలన పేరుతో మోడీ ఎదురుదాడికి దిగారు. మోడీ ప్రసంగం వింటుంటే.. ప్రధానిగా అన్ని రాష్ట్రాలపై సమదృష్టి ఆయనకి ఉండాలి కదా, కానీ ఇదేంటీ… ఇలా రాష్ట్రం, కేంద్రం వేర్వేరు అనే భావన కలిగించేలా మాట్లాడుతున్నారూ అనిపిస్తుంది. దేశంలో మాదిరిగానే తెలంగాణలో అభివ్రుద్ధి చేస్తామని ప్రధాని చెప్పడం మరీ విడ్డూరం.