ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలో జరిగిన భాజపా జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రాలోకి సీబీఐ ప్రవేశాన్ని అడ్డుకుంటూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. భయపడేంత తప్పులు వారు చేశారు కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటూ ఏపీతోపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సీబీఐని నిరాకరించినవారు రేప్పొద్దున మరో సంస్థను కూడా వద్దనే పరిస్థితికి వస్తారన్నారు. వారి దృష్టిలో పోలీసులు, సైన్యం, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం.. ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ తప్పుడుగానే కనిపిస్తాయనీ, వారు మాత్రమే సచ్ఛీలురుగా చెప్పుకుంటున్నారని చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని ఎద్దేవా చేశారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, తనపై తప్పుడు కేసులు పెట్టిందనీ, అయినా తాను తొమ్మిది గంటల సేపు విచారణ ఎదుర్కొన్నానని మోడీ చెప్పారు.
విచిత్రం ఏంటంటే… సీబీఐ ఎందుకు వద్దు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నిస్తూ ఉండటం! ఎందుకు వద్దన్నారో వారికి తెలీదా..? కారకులు వారే కదా! కేంద్ర సంస్థల్ని భాజపా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయోగించే ఒక గొప్ప సంస్కృతికి తీసుకొచ్చింది ఎవరు…? తనను రాజకీయంగా ఎవరైనా ప్రశ్నిస్తే… సీబీఐ దాడులు, ఐటీ దాడులు చేయించింది ఎవరు..? అంతెందుకు, ఈ మధ్య కాలంలో సీబీఐలో చోటు చేసుకున్న అలోక్ వర్మ వ్యవహారానికి కారణం ఎవరు..? ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవిలోకి తీసుకోమని సుప్రీం కోర్టు చెప్పగానే మోడీ సర్కారుకే టెన్షన్ పెరిగిన మాట వాస్తవమా కాదా..? ఆయన్ని వెంటనే వేరే శాఖకు బదిలీ చేసేంత కంగారు ఎందుకు..? ఆ తరువాత అలోక్ వర్మ రాజీనామా కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహరంలో సీబీఐకు ఉన్న ప్రాధాన్యతను భ్రష్టుపట్టించింది సాక్షాత్తూ మోడీ సర్కారే.
అదొక్కటే కాదు… స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రిజర్వ్ బ్యాంకు పరిస్థితీ అంతే! ఆర్.బి.ఐ.కి తెలియకుండానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటారు, వారి దగ్గర ఉన్న నిధుల్ని ఎలా వినియోగించాలో వారే శాసిస్తారు! కేంద్ర సంస్థల స్వయం ప్రతిపత్తిని దారుణంగా దెబ్బతీసిందే భాజపా సర్కారు. దాంతో ప్రజల్లో సీబీఐ, ఆర్.బి.ఐ. వంటివాటిపై నమ్మకం పోయే పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి, రాష్ట్రాలు కూడా తమపై జరుగుతున్న రాజకీయ దాడులను తిప్పికొట్టేందుకే సీబీఐ ప్రవేశంపై ఆంక్షలు పెట్టాయి. అయినా, చంద్రబాబు చేసిందేమీ రాజ్యాంగ విరుద్ధమైన చర్య కాదు కదా! దానిపై ప్రధాని ఇంతగా విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది..?