మోడీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే మోడీ… ఇది గత ఎన్నికల్లో భాజపా మేనిఫెస్టో. కాంగ్రెస్ అవినీతి కారణంగా దేశం వెనకబడిపోయిందనీ, మోడీ వస్తే దేశం దూసుకుపోతుందని గత ఎన్నికల్లో చెప్పారు. నల్లధనం ఎక్కడున్నా తవ్వి తీస్తామనీ, పేదల అకౌంట్లలో లక్షలు జమ చేస్తామనీ గత ఎన్నికల్లో చెప్పారు. ఇలా గత ఎన్నికల మేనిఫెస్టోలోని ఎన్నో అంశాలు ఇప్పటికీ ప్రజలు గుర్తున్నాయి. ఐదేళ్ల తరువాత, ఇప్పుడు మరోసారి ఎన్నికలకు వెళ్తున్న భాజపా మేనిఫెస్టో ఎలా ఉందంటే… మోడీ మార్కు అభివృద్ధి మంత్రానికి దూరంగా ఉందని చెప్పాలి.
సంకల్ప్ పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని భాజపా విడుదల చేసింది. మొత్తం 45 పేజీల మేనిఫెస్టోని ప్రధాని మోడీతోపాటు అమిత్ షా, రాజ్ నాథ్ లు విడుదల చేశారు. రాబోయే ఐదేళ్లలో గ్రామీణాభివ్రుద్ధికి రూ. 25 లక్షల కోట్లు ఖర్చు చేస్తామనీ, భూ రికార్డుల డిజిటలైజేషన్, పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి.. ఇలా రైతులకు కొన్ని వరాలు ప్రకటించింది. ఇలా కొన్ని కంటి తుడుపు ప్రకటనలు చేస్తూ… రామమందిరాన్ని వీలైనంత త్వరగా కడతామనీ, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఎ రద్దు కోసం ప్రయత్నిస్తామనీ, సైనిక బలగాలను బలోపేతం చేస్తామనీ, దేశవ్యాప్తంగా పౌర రిజిస్టర్ ను అమలు చేస్తామనీ, ఉగ్రవాదం మీద రాజీలేకుండా పోరాటం చేస్తాం.. ఇలాంటి అంశాలు భాజపా మేనిఫెస్టోలో ఉన్నాయి. చివరికి శబరిమల అంశం కూడా ప్రస్థావించడం విశేషం.
గత ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం జపించిన భాజపా.. ఇప్పుడు కేవలం ఎన్నికల లబ్ధి కోసమే మేనిఫెస్టోని తయారు చేసి విడుదల చేసిందని అనొచ్చు. పైన పేర్కొన్న అంశాలను గమనిస్తే… మత ప్రాతిపదికన ఇచ్చిన హామీలే ఎక్కువ. వాటితోపాటు, వివాదాస్పదంగా ఉన్న పౌర రిజిస్టర్ అంశం, జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఒకప్పటి జనసంఘ్ కాలం నాటి అంశాలను తెర మీదికి తీసుకొచ్చి, హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నమే అంతర్లీనంగా భాజపా మేనిఫెస్టోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేస్తామని చెప్పి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పర్యవసానాల ప్రస్థావన లేదు. మేక్ ఇన్ ఇండియా పేరుతో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, వాటికి కొనసాగింపు అంశాలేవీ మేనిఫెస్టో లేవు. నల్లధనంపై ఎలాంటి హామీ లేదు. జీఎస్టీ గురించి మాట లేదు. పెట్రో ఉత్పతులను జీఎస్టీ పరిధిలోకి తెస్తారా అనే చర్చ దేశంలో ఉన్నా… అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదు. ఓవరాల్ గా గత ఎన్నికల్లో మోడీని అభివృద్ధికి ఐకాన్ గా ప్రొజెక్ట్ చేసిన భాజపా… ఇప్పుడా అభివృద్ధి మాటకే ప్రాధాన్యత లేని మేనిఫెస్టో రూపొందించిందని చెప్పుకోవచ్చు.