జీఎస్టీ గురించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎప్పుడు మాట్లాడినా… ఇదో చారిత్రక నిర్ణయం, భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయం, దీని వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతున్నాం.. ఇలా చాలా చెప్పారు. ఈక్రమంలో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని ఎవరైనా విమర్శిస్తే, కాదు కాదు.. చాలా లాభపడుతున్నారని అనేవారు. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వాస్తవాలు తెలిసొస్తున్నట్టున్నాయి. జీఎస్టీ వచ్చాక చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, వచ్చే ఎన్నికల్లో మోడీకి మరోసారి ఓటెయ్యని పరిస్థితి రాబోతుందని తెలియడంతో… ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే జీఎస్టీ పరిధిలోని కొన్ని వస్తువులపై పన్ను తగ్గించిన కేంద్రం ప్రభుత్వం… జీఎస్టీ పన్ను కిందకు వచ్చే వ్యాపార పరిమితిని మారుస్తూ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
జీఎస్టీతో దెబ్బతిన్న వ్యాపారులను ప్రసన్నం చేసుకోవడం కోవడం కోసం వ్యాపార పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకి పెంచింది. కాంపోజిషన్ పథకం కిందున్న పరిమితిని కోటిన్నర చేసింది. అంటే, రూ. 40 లక్షల టర్నోవర్ లోపు ఉన్న ఏ సంస్థా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయాన్ని గొప్పగా చెబుతూ…. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా కోత పడుతున్నా, వ్యాపారుల అభ్యున్నతికి కట్టుబడి తమన సర్కారు ఉంటుందని అరుణ్ జైట్లీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. తాజా నిర్ణయంలో దేశంలోని చాలా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు జీఎస్టీ పరిధి నుంచి బయటపడే అవకాశం ఉంది.
వ్యాపారులకు ఇది ఊరటను ఇచ్చే నిర్ణయమే. కానీ, ఈ సందర్భంగా ప్రభుత్వ చిత్తశుద్ధినే ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఎన్నికలకు కొన్ని నెలలు సమయం ఉందనగానే… ఇలా వర్గాలవారీగా, కులాల వారీగా ప్రేమను కురిపించే పనిలో పడింది మోడీ సర్కారు. మొన్నటి మొన్న అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు అంటూ బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడీ జీఎస్టీ తగ్గింది. ఇలాంటి నిర్ణయాలు మరికొన్ని ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే, మోడీ సర్కారు పాలనలో వైఫల్యం చెందిందని వారే ఒప్పుకొంటున్నట్టు లెక్క. మరీ ముఖ్యంగా జీఎస్టీ గురించి అయితే… దీన్నొక చారిత్రక నిర్ణయం అన్నారు. వారు తీసుకున్న నిర్ణయానికే ఇప్పుడు సవరణలు చేస్తున్నారు! ఇవి నూటికి నూరుపాళ్లు ఓటు బ్యాంకును ఆకర్షించే నిర్ణయాలు మాత్రమే. భాజపాకి ఇప్పటికిప్పుడు పుట్టుకొస్తున్న ఈ కొత్త ప్రేమని ప్రజలు ఎంతవరకూ నమ్ముతారో చూడాలి మరి.