ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. రాయలసీమవాదం అందుకున్నంత పని చేశారు. రాయలసీమకు ప్రత్యేకమైన నిధులు ఇస్తున్నామని.. వాటిని ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదని… కార్యకర్తలతో జరిగిన యాప్ భేటీలో వ్యాఖ్యానించారు. ఏపీలో విభజన హామీల సెగ పెరిగినప్పుడు.. కొంత మంది బీజేపీ నేతలు.. రాయలసీమ విభజన వాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రత్యేకంగా ఓ డిక్లరేషన్ అంటూ విడుదల చేసి హంగామా చేశారు. ప్రజల్లో విభజన బీజం నాటి.. తమ వంతు రాజకీయం చేద్దామనుకున్నారు. ఇప్పుడు దాన్ని ప్రధానమంత్రి మోడీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా.. ఆయన తాజా మాటలతో తేలిపోతోంది.
“ఏపీ ప్రభుత్వం మాత్రం రాయలసీమకు భరోసానివ్వడం లేదని ఆయన చెబుతున్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల అభివృద్ధికి మేము కార్యక్రమాన్ని తెచ్చాం. ఆ ప్రాంతంలో లభించే ఖనిజవనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగం అక్కడే అభివృద్ధికి కేటాయిస్తున్నాం. ఆ నిధులను ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు…” అంటూ ప్రధాని స్థాయిలో ఉన్న విషయం మర్చిపోయి.. ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అలా అని.. రాయలసీమకు.. కేంద్రం ఏమిచ్చిందో చెప్పలేకపోయారు. విభజన హామీల ప్రకారం రావాల్సిన స్టీల్ ప్లాంట్ విషయాన్ని కూడా మోడీ చెప్పలేదు. అలాగే వెనుకబడిన జిల్లాల పేరుతో చట్టం ప్రకారం రాయలసీమలోని ఒక్కో జిల్లాకు రావాల్సిన రూ.50 కోట్లను కూడా.. ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న బాపతు ఘనకార్యం ఎదురుగా ఉండగానే… మోడీ… రాయలసీమపై మొసలి కన్నీరు కార్చారు.
భారతీయ జనతా పార్టీ రాజకీయంలో.. కులాలు, మతాలు, ప్రాంతాలే కీలకం. ఇప్పుడు దాన్ని దక్షిణాదిలోనూ అమలు చేస్తున్నారు. ఏపీ విషయంలోనూ.. అదే చేయబోతున్నారన్న అంశం ప్రధానమంత్రి మాటల ద్వారా తేలిపోతోంది. ఏపీకి ఏం చేశారో.. చెప్పలేరు కానీ.. రాజకీయ విమర్శలు చేసి… సమయం గడిపేస్తున్నారు.