ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా.. అంటే, టీడీపీతో పొత్తు తెగతెంపులు చేసుకున్నాక ఆంధ్రాకి వస్తున్నారు. జనవరి 6న గుంటూరులో జరిగే పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు ఏపీ భాజపా నేతలు ఏర్పాటు మొదలుపెట్టేశారు. కనీసం రెండు లక్షలమందిని ఈ సభకు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారట! చాన్నాళ్ల తరువాత వస్తున్న మోడీ… ఆంధ్రాలో ఏం మాట్లాడతారు? ప్రత్యేక హోదా, విభజన హామీలూ… వీటి జోలికి వెళ్తారా? ఇంతకీ, ఈ పర్యటనకి ఆయనో ప్రధానిగా వస్తున్నారా, లేదంటే భాజపా నాయకుడిగా వస్తున్నారా..? ఇలాంటి చాలా అనుమానాలున్నాయి.
రాజకీయంగా చూసుకుంటే, లోక్ సభ ఎన్నికల ప్రచారం కంటే ఓసారి ముందుగా ఏపీ వస్తున్నారు ప్రధాని మోడీ. వాస్తవానికి, గుంటూరులో జరుగుతున్నది పార్టీ కార్యక్రమం మాత్రమే, దీనికి అధ్యక్షుడు అమిత్ షా వచ్చినా సరిపోతుంది. కానీ, ఆంధ్రా తమకు ప్రధానమైన రాష్ట్రం అని చెప్పుకోవాలంటే… ఎప్పుడో ఎన్నికలప్పుడొస్తే సరిపోదు కదా! అందుకే, ఇప్పుడీ మోడీ టూర్..! అయితే, ప్రత్యేక హోదా గురించిగానీ, ఇతర విభజన హామీల గురించిగానీ మోడీ ఏదో మాట్లాడేస్తారని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఎందుకంటే, 14వ ఆర్థిక సంఘం హామీ ఇవ్వొద్దు అందని చెప్పినా, రైల్వేజోన్ కి పక్క రాష్ట్రం ఒడిశాతో సమస్యలున్నాయని చెప్పినా, కడప స్టీల్ ప్లాంట్ పై రాష్ట్రమే తమకు సమాచారం ఇవ్వలేదన్నా.. ఇలా ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరు, నమ్మించదగ్గ వాదన వినిపించే కంటెంట్ కూడా భాజపా దగ్గర అస్సలు లేదు. ఫలానా కారణం వల్ల ఆంధ్రాకు ఇవేవీ ఇవ్వలేకపోయాం అని మోడీ చెప్పగలరా..? కాబట్టి, ఆ అంశాలు ఎత్తుకుంటే సెల్ఫ్ గోల్ అవుతుంది. కేంద్రం చాలా చేసిందనీ, ఇళ్లూ మరుగుదొడ్లూ విద్యా సంస్థలూ పోలవరం… ఇలా తమ నిధులే అంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. టీడీపీ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసే అవకాశాలూ కొంత ఉంది.
భాజపా వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం… కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అవకాశం… లేదా, కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం మోడీ చేస్తారని తెలుస్తోంది. ఆ వర్గాన్ని దగ్గర చేసుకోవడం ద్వారా భాజపాకి ఏపీలో భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర నేతలు మోడీకి సూచించినట్టు వినిపిస్తోంది. సరే, ఇదెలా ఉన్నా… మోడీ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేయాలనే ఆలోచనలో ఉన్నాయట! ఈ పర్యటనను కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా చెప్పేశారు. జనవరి 6కి కొంత సమయం ఉంది కాబట్టి… ఈలోగా మోడీ పర్యటనకు సంబంధించిన చర్చ ఏపీలో రాజకీయంగా బాగా ప్రాధాన్యత సంతరించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.