ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొండి వైఖరి ఏ స్థాయిలో ఉంటుందో రానురానూ బహిర్గమౌతున్న సంగతి చూస్తున్నాం. ఏపీ విషయంలో అనుసరిస్తున్న ధోరణే అందుకు ఒక ఉదాహరణ. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టుగా ఉంది. ప్రధానమంత్రి పదవికి మోడీ కళంకం తెస్తున్నారనే కొత్త ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమౌతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధాని అంటే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత సంయమనంతో ఉండాలనే అంశాన్ని ఫోకస్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి అనుగుణంగా మాజీ మన్మోహన్ సింగ్ ను రంగంలోకి దింపుతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో.. తాను మౌనముని కాదనీ, దేశంలోని సమస్యలపై మాట్లాడలేని మోడీ మౌనముని అంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. ఒక ప్రధాని స్థానంలో ఉన్న మోడీ, తన శక్తియుక్తులూ అధికారాలను వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు అంటూ రాష్ట్రపతికి మన్మోహన్ ఫిర్యాదు చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలను బెదిరించే విధంగా మోడీ మాట్లాడారంటూ ఒక వీడియో క్లిప్పింగ్ ను కూడా రాష్ట్రపతికి పంపించారు. ‘మీరు గీత దాటితే, నేను మోడీని అని మర్చిపోవద్దు. తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ హుబ్లీ సభలో మోడీ హెచ్చరించారు. మోడీ మాట తీరు, బెదింపులు, ఉపయోగిస్తున్న పదజాలం అభ్యంతకరంగా ఉన్నాయనీ, గతంలో ఏ ప్రధాని కూడా ప్రతిపక్షాల పట్ల ఇలాంటి కక్షపూరిత ధోరణిలో వ్యవహరించలేదని మన్మోహన్ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఈ లేఖలో పార్లమెంటులోని ఉభయసభల కాంగ్రెస్ నేతలు కూడా సంతకాలు చేసి పంపించడం విశేషం.
నిజానికి, ఈ లేఖ అందిన తరువాత రాష్ట్రపతి ప్రత్యేకంగా చేసేదేం ఉండదు! పోనీ, ఇకపై ఇలాంటి మొండి వైఖరితో మాట్లాడొద్దని మోడీని మందలించే అవకాశం ఉంటుందనీ అనుకోలేం. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు. అయితే, ప్రధాని మొండి వైఖరిపై కాంగ్రెస్ నేతలంతా జాతీయ స్థాయిలో ఒకేసారి స్పందించడం చర్చనీయం అవుతుంది కదా. పైగా, ప్రధానిగా మన్మోహన్ వ్యవహరించిన తీరుకీ, నేటి మోడీ శైలికీ ఉన్న తేడాను ప్రజలకు చెప్పే ప్రయత్నంగా ఇది పనికొస్తుంది. ఒక మేధావిగా, విద్యాధికుడిగా మన్మోహన్ కు కొంత పాజిటివ్ ఇమేజ్ ఉంది. అందుకే, ఆయన్ని ముందుపెట్టి, ఈ లేఖను రాష్ట్రపతికి పంపించారని అనుకోవచ్చు.